పవన్ కల్యాణ్ రాజకీయ అవతారం ఎత్తాక ఆయన డైలాగులు సినీ ఫక్కీలో ఉంటున్నాయన్న విమర్శలు చాలా వచ్చాయి. పవన్ జనసేన స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కూడా సినిమాటిక్ గానే ఉందన్న వారూ ఉన్నారు. ఇక జగన్ ఎలా సీఎం అవుతాడో చూస్తానంటూ తొడగొట్టి చాలెంజ్ చేసిన పవన్ లోనూ జనసేనాని కంటే కూడా సినిమా హీరోయే కనిపిస్తారు. ఇపుడు పవన్ మీడియా ముఖంగా మాట్లాడుతున్న మాటలు కానీ మీటింగు లో ప్రసంగాలు కానీ సినిమా వాసనలు వదిలించుకోవడంలేదని కూడా కామెంట్స్ పడుతున్నాయి.


పవన్ పాతికేళ్ల కెరీర్లో పాతిక సినిమాలు మాత్రమే చేశారు. అంటే సగటున ఆయన ఏడాదికి ఒక సినిమా చేశారన్న మాట. పవన్ సినిమా తీయడానికే ఏడాది పైగా సమయం తీసుకుంటే ఓ పెద్ద రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టి ఫలితాలు చూపించేందుకు మూడు నెలల సమయం ఎలా సరిపోతుందనుకున్నారని వైసీపీ నేతల నుంచి కౌంటర్లు పెద్ద ఎత్తున పడుతున్నాయి.  పవన్ కొంతకాలం ఓపిక పట్టి  ఆగలేరా అంటూ ఒకనాటి ప్రజారాజ్యం ఎమ్మెల్యే, ఈనాటి వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారంటే అందులో అర్ధం ఉంది కదా అంటున్నారు.


పవన్ కళ్యాణ్ వంద రోజులకే ఈ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అనేస్తున్నారంటే ఆయన రాజకీయం  ఏంటన్నది అర్ధం కావడంలేదని వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. పవన్ చంద్రబాబు కు తొత్తుగా మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు అంటే, పవన్ సొంత అజెండాతో రావాలని మరో ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్న్నారు. పవన్ మాటలు కామెడీగా ఉంటున్నాయని కూడా వైసీపీ నేతలు అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే పవన్ వంద రోజుల పాలనపైన ఇన్ని మాటలు అనడం ఆయనకు ప్రతిపక్ష నేతగా ఉన్న హక్కు అని, అయితే అదే నోటితో బాగున్న ఒక్క పధకాన్ని కానీ ఒక కార్యక్రమాన్ని కానీ చెప్పి ఉంటే పవన్ నిష్పాక్షికత వెల్లడయ్యేదని కూడా అంటున్నారు. పవన్ మాత్రం తాను అన్ని  రాజకీయ పార్టీల మాదిరిగా ఆ తానులో ముక్కనేనని నిరూపించుకుంటున్నారని వైసీపీ నేతలతో సహా అంతా అంటున్నారు. 


పవన్ మొత్తానికి విమర్శలు చేద్దామనుకున్నా ఆయన మీద చంద్రబాబు ముద్ర గట్టిగానే పడుతోంది. మరి దీనికి  ఏంటి.. ఎలా  రెమిడీ చేయాలన్నది పవనే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా తోటి సినీ నటుడు బండ్ల గణేష్ చెప్పినట్లుగా పవన్ లాంటి వారు  సర్కార్ మీద నాలుగు  రాళ్లు వేసే బదులు ఏపీ అభివ్రుధ్ధికి చిత్త శుద్ధితో సహకారం అందిస్తే  విభజన గాయాలతో బాధ పడుతున్న ఏపీకి కొంత న్యాయం జరుగుతుందని అన్న వారూ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: