తెలంగాణలో యూరియా కష్టాలు తీరలేదు. అన్ని జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంతా లైన్‌లో నిల్చున్నా యూరియా దొరుకుతుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది. ముఖ్యంగా ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. క్యూ లైన్ల వద్ద తోపులాటలు కూడా జరుగుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్నా యూరియా లభించకపోవటంతో పంట దిగుబడి మీద ఆశలు వదిలేసుకుంటున్నారు రైతులు. 


ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు ఇంకా పోనేలేదు. ఉదయం క్యూ లైన్‌లో ఉంటేనే బస్తా... లేకపోతే ఇక అంతే సంగతులు. కొన్ని చోట్ల చెప్పులను కూడా రైతులు క్యూ లైన్‌లో పెడుతున్నారు. మరికొన్ని చోట్ల ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను క్యూ లైన్ లో పెట్టాల్సి వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా ఇబ్బందులు మరింత పెరిగాయి. అన్నదాతకు  యూరియా కష్టాలు రెట్టింపవుతున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పంపిణీ  కేంద్రాల వద్ద తెల్లవారగానే  క్యూలో ఉంటేనే ఎరువులు దొరుకుతున్నాయి. క్యూ లైన్ దగ్గర ఇప్పటికీ తోపులాటలు జరుగుతూనే ఉన్నాయి. 


ఇక...ఈ చెప్పుల క్యూ లైన్ చూస్తే పరిస్థితి ఏంటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇది పాలకుర్తి సొసైటీ దగ్గర కనిపించిన దృశ్యం. కొన్ని చోట్లా క్యూ లైన్ లో తోపులాటలను నివారించేందుకు టోకెన్ ఇస్తున్నారు. ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాల వద్ద  రైతులు పట్టాపాస్‌ పుస్తకాలు, ఆధార్‌ కార్డులను లైన్ లో ఉంచుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి, వర్ధన్న పేట..  నర్సంపేట, మహబూబాబాద్‌లలలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసినా కొన్ని చోట్ల ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున మాత్రమే యూరియా ఇస్తున్నారు.  కొన్ని చోట్ల ఒక బస్తానే దొరుకుతుంది. అది కూడా దొరకని రైతులు పంపిణీ కేంద్రాల నుంచి నిరాశతో వెనుదిరుగుతున్నారు.


అటు...ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి..కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ వ్యవసాయ సహాకార పరపతి సంఘం వద్ద యూరియా కోసం  రైతులు ఆందోళకు దిగారు. ఎనిమిది రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్నామని ... అయినా పంపిణీ చేయడం లేదని రైతులు ధర్నా చేశారు. వచ్చిన యూరియా కూడా సరిపోవడంలేదని మండిపడుతున్నారు అన్నదాతలు. ఆదిలాబాద్ జిల్లాలో సైతం రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా ఎట్టకేలకు రావడంతో బస్తాలు తీసుకోవడం కోసం గంటల తరబడి క్యూలో నిల్చున్నారు రైతులు. ఖరీఫ్ సీజన్ పూర్తి కావస్తున్నా...సరైన సమయంలో యూరియా అందించటంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తమను యూరియా కష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: