దేశీయంగా తయారైన తేలిక పాటి యుద్ధ విమానం తేజస్‌ మరో ఘనత సాధించింది. విమాన వాహక నౌకపై సైతం దిగేందుకు సిద్ధమౌతోంది. గోవాలో నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. గంటకు 244కిలో మీటర్ల వేగంతో దూసుకొచ్చిన విమానం... కేవలం 2 సెకన్లలో ఆగిపోయింది. అవును... కేవలం రెండే సెకన్లలో 244 కిలో మీటర్ల నుంచి సున్నాకు పడిపోయింది దాని వేగం. ఇదీ ఇండియన్‌ నేవీ కోసం సిద్ధమైన లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ - ఎల్.సి.ఎ తేజస్‌ సామర్థ్యం.     


పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్‌ ఏరోనాటికల్స్‌ - HAL అభివృద్ధి చేసిన ఎల్.సి.ఎ తేజస్‌ను విమాన వాహక నౌకలపై మోహరించాలని  నిర్ణయించింది ప్రభుత్వం. దీంతో నేవల్‌ ఎల్.సి.ఎ తయారీకి శ్రీకారం చుట్టింది HAL. ఎల్.సి.ఎ-ఎన్ పేరుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో భాగంగా... విమానం తోక భాగంలో ఓ హుక్‌ను అమర్చారు.  గోవా తీరంలో షోర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఫెసిలిటీలో దీనిని విజయవంతంగా పరీక్షించారు. వేగంగా దూసుకొచ్చిన ఎల్.సి.ఎ-ఎన్ టెస్ట్‌ రన్‌వేపై ల్యాండైంది. దాదాపు 87 మీటర్ల దూరం అదే వేగంతో దూసుకెళ్లిన విమానం... అరెస్ట్‌ కేబుల్‌తో హుక్‌ కాగానే ఆగిపోయింది. కేవలం రెండు సెంకడ్లలోనే విమానం వేగం 244 కిలో కిలో మీటర్ల నుంచి సున్నాకు తగ్గిపోయింది. ఇంత వరకూ ఈ తరహా ప్రయోగాన్ని 60 సార్లు చేశామంటోంది  ఎల్.సి.ఎ ప్రాజెక్ట్‌ టీమ్‌.  


ఎయిర్‌ క్రాఫ్ట్‌ కారియర్‌ డెక్‌పై కూడా ఇదే తరహాలో యుద్ధ విమానాలు ల్యాండవుతాయి. విమానానికి అమర్చిన హుక్‌... డెక్‌పై ఏర్పాటు అరెస్ట్‌ కేబుల్‌ను తాకుతూ వెళ్తుంది. హుక్‌ కేబుల్‌కు చిక్కుకోగానే... కేబుల్‌ను వేగంగా చుట్టేస్తుంది అరెస్టర్‌. దీంతో విమానం ముందుకెళ్లే అవకాశం లేక ఆగిపోతుంది. ఏదైనా కారణం వల్ల కేబుల్‌కు హుక్‌ కాకపోతే... వెంటనే పైలెట్‌ విమానాన్ని తిరిగి గాల్లోకి లేపే అవకాశం ఉంటుంది. దీంతో విమానం సముద్రంలో పడిపోయే ప్రమాదం తప్పుతుంది. అయితే గోవాలోని టెస్ట్‌ ఫెసిలిటీలో గల అరెస్టర్‌ గేర్‌... మన విమాన వాహక నౌక INS విక్రమాదిత్యపై ఉన్న దానికి కాస్త భిన్నమైంది. యుద్ధ విమాన వేగాన్ని అనూహ్యంగా తగ్గించడంలో ఈ రెండు అరెస్టర్‌ గేర్‌ల మధ్య కొంత వ్యత్యాసం ఉంది. అలాగే ఎయిర్‌ క్రాఫ్ట్‌ కారియర్‌ సముద్రంలో ప్రయాణిస్తుండగా, విమానాన్ని డెక్‌పై ల్యాండ్‌ చేయాల్సి ఉంటుంది. డెక్‌పై గల అరెస్ట్‌ కేబుళ్లకు హుక్‌ అయ్యేలా విమానాన్ని వేగంగా దించాల్సి ఉంటుంది. అయితే, విక్రమాదిత్యపై సైతం తేజస్‌-Nను విజయవంతంగా ల్యాండ్‌ చేయగలమనే ధీమాతో ఉంది ప్రాజెక్ట్‌ టీమ్‌. 



మరింత సమాచారం తెలుసుకోండి: