విద్య లేని వాడు వింత ప‌శువు! అన్నారు పెద్ద‌లు. మ‌రి ఉన్న‌త విద్య‌ను చ‌దువుకుని పెద్ద పెద్ద పీఠాల్లో కొలువుదీరి, స‌మున్న‌త ల‌క్ష్యంగా ఉన్న‌త విద్య‌ను అభ్య‌శించాల‌ని వ‌స్తున్న విద్యార్థుల ప‌ట్ల ఈ ఉన్న‌త విద్యాధికులు ఏం చేస్తున్నారు? ఏమేర‌కు ఆద‌ర్శంగా ఉంటున్నారు?  ఏమేర‌కు వారికి మార్గ‌ద‌ర్శ‌కులుగా మారుతున్నారు? ఇప్పుడు స‌మాజంలో ఈ ప్ర‌శ్న‌ల‌పైనే చ‌ర్చ‌లు సాగుతున్నా యి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. తిరుప‌తి కేంద్రంగా రాష్ట్రానికే కాకుండా దేశం మొత్తానికి ఆద‌ర్శంగా నిలిచిన శ్రీవేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల యంలో జ‌రుగుతున్న నిర్వాకాలే క‌నిపిస్తున్నాయి. ఇక్క‌డ ఉన్న‌త విద్య‌ను అభ్య‌శించేందుకు దేశంలోని న‌లుమూల‌ల నుంచి కూడా విద్యార్థులు ఎన్నో ల‌క్ష్యాల‌ను పెట్టుకుని ఇక్క‌డ‌కు వ‌స్తారు.


ప్రాంతం కాని ప్రాంతమే అయినా శ్రీవారి చ‌ర‌ణాల ద‌గ్గ‌ర విద్య‌ను అభ్య‌శించ‌డం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు. అలాంటి యూనివ‌ర్సిటీలో ఉన్న‌తాధికారులే త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా విద్య‌ను అందించ‌డం మానేసి కొన్ని పార్టీల అజెండాల‌ను మోస్తున్నార‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా జ‌రిగిన ఓఘ‌ట‌న యూనివ‌ర్సిటీకి ఉన్న పెద్ద పేరును కూడా పాడుచేస్తోంద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే... కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని సాంకేతిక ప‌నుల‌ను ఓ సంస్థ‌కు ఈ యూనివ‌ర్సిటీ అప్ప‌గించింది. దీనిని ప్ర‌స్తుతం ఈ యూనివ‌ర్సిటీకి ఉన్న ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇలాంటి ప‌నుల విష‌యంలో ఏదైనా లోపాలు జ‌రిగితే.. నిబంధ‌న‌ల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఆయ‌న‌కు ఉంటుంది.


అంతేకాదు, యూనివ‌ర్సిటీకి ఉన్న పాల‌క మండ‌లి దృష్టికి తీసుకువెళ్లి స‌ద‌రు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. అయితే, ప్ర‌స్తుతం ఇంచార్జ్ రిజిస్ట్రార్ వ్య‌వ‌హ‌రించిన తీరును ప‌లు విద్యార్థి సంఘాలు ఖండిస్తున్నాయి. ఆయ‌న వ్య‌వ‌హార శైలిని కూడా త‌ప్పుప‌డుతున్నాయి. స‌ద‌రు సాంకేతిక ప‌నులు చేస్తున్న సంస్థ ప్ర‌తినిధిని నేరుగా త‌న కార్యాల‌యానికే పిలిపించిన రిజిస్ట్రార్‌.. ఆయ‌న‌ను 30 నిమిషాల పాటు నిర్బంధించార‌ని స‌మాచారం. అంతేకాదు, స‌ద‌రు ప్ర‌తినిధి తాను దివ్యాంగుడిన‌ని, కేవ‌లం ఉద్యోగిని మాత్ర‌మేన‌ని, ఏదైనా స‌మ‌స్య ఉంటే అధికారికంగా చెప్పాల‌ని, వాటిని తాను సంస్థ ఉన్న‌తోద్యుగుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాన‌ని విన్న‌వించినా కూడా స‌ద‌రు ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప‌ట్టించుకోకుండా మాన‌సికంగా దూషించార‌ని అంటున్నాయి విద్యార్థి సంఘాలు.


ప్ర‌స్తుతం ఈ విష‌యం తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఓ దివ్యాంగుని ఏకంగా విశ్వ‌విద్యాల‌య పెద్ద అధికారి ఇలా త‌న గ‌దిలో నిర్బంధించ‌డం ఏంట‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. దీనిపై అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఏదైనా పొర‌పాటు జ‌రిగి ఉంటే.. నిబంధ‌న‌ల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవ‌డం మానేసి రాజ‌కీయ అజెండాల‌ను మోయ‌డం, గ‌త ప్ర‌భుత్వ పాల‌కుల క‌నుస‌న్న‌ల్లో మెల‌గడం ఎందుకు? అని విరుచుకుప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం తిరుప‌తి వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. మ‌రి దీనిపై రిజిస్ట్రార్ ఎలాంటి ఆన్స‌ర్ చెబుతారో చూడాలి. ఏదేమైనా.. విశ్వ‌విద్యాల‌యాల్లో పంచాయితీలు నిర్వ‌హించ‌డంపై స‌మాజంలో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: