దేశానికి భావిభార‌త అధ్యాప‌కుల‌ను, ఉన్న‌త ఉద్యోగుల‌ను అందించాల్సిన విశ్వ‌విద్యాల‌యాల‌ను దేవాల‌యాల‌తో పోల్చారు ఆంధ్రా యూనివ‌ర్సిటీ మాజీ వీసీ దివంగ‌త స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్‌. స‌మున్న‌త ల‌క్ష్యాల‌తో విశ్వ‌విద్యాల‌యాలు ప‌నిచేస్తే.. దేశం కూడా స‌మున్న‌తంగా అభివృద్ది చెందుతుంద‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఆంధ్ర యూనివ‌ర్సిటీకి ఇప్ప‌టికి అంత పేరు ఉండేందుకు ఇలాంటి దార్శ‌నికులు ఎంతో మంది అక్క‌డ వీసీలుగా రిజిస్ట్రార్లుగా ప‌నిచేయ‌డం వ‌ల్లే. అయితే, తాజాగా ప‌ర‌మ ప‌విత్ర‌మైన తిరుప‌తి న‌గ‌రంలో ఉన్న శ్రీవేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యం వివాదాల‌కు కేంద్రంగా మారిపోయిందనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ రాజ‌కీయ ప్రాబ‌ల్యం పెరిగిపోయింద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.


ఎన్నో స‌మున్న‌త ల‌క్ష్యాల‌తో ఈ యూనివ‌ర్సిటీని ప్రారంభించిన స‌మ‌యంలోనే దీనికి ద‌శ‌దిశ‌ను కూడా స‌మున్న‌తంగా ఉండేలా నిర్వచించారు. అయితే, కాల క్ర‌మంలో ఉన్నత ప‌ద‌వుల్లో ఉన్న వారు రాజ‌కీయ ప్రాబ‌ల్యాల‌కు లౌల్యుగా మారుతున్నార‌నే వ్యాఖ్య‌లు ఈ యూనివ‌ర్సిటీకి ఉన్న గొప్ప పేరును చెడుగొడుతున్నాయ‌ని తిరుప‌తికి చెందిన మేధావులు ఆరోపిస్తున్నారు. తాజాగా జ‌రిగిన రెండు ఘ‌టన‌లు యూనివ‌ర్సిటీని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా విమ‌ర్శ‌ల‌పాలు చేసింది.


విద్యార్థుల ప్ర‌యోగ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన మార్కుల‌ను అస‌లు మార్కుల్లో క‌ల‌పి ప్ర‌క‌టించ‌డంలో చోటు చేసుకున్న లోటుపాట్లు ఒక ఎత్త‌యితే.. ఈ విశ్వవిద్యాల‌యానికి సంబంధించిన సాంకేతిక ప‌నుల‌ను చూస్తున్న ఓ కార్పొరేట్ సంస్థ ప్ర‌తినిధిని నిర్బంధించ‌డం మ‌రో స‌రికొత్త వివాదంలోకి నెట్టేసింది. ఈ మొత్తం తతంగం వెనుక కూడా ఇంచార్జ్ రిజిస్ట్రార్ పాత్ర ఉంద‌నే విమ‌ర్శ‌లు గుప్పుమంటున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఎస్వీ యూనివ‌ర్సిటీకి అనుబంధంగా ఉన్న క‌ళాశాల‌లో విద్యార్థుల‌కు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆయా మార్క‌లు జాబితాల‌ను యూనివ‌ర్సిటీల‌కు పంపారు.


అయితే, వీటిని ప్ర‌ధాన స‌బ్జెక్టుల మార్కుల‌కు జోడించి ప్ర‌క‌టించ‌డంలో యూనివ‌ర్సిటీ విఫ‌ల‌మైంది. దీంతో 250 మంది విద్యార్థులు న‌ష్ట‌పోయార‌నేది ప్ర‌ధాన వాద‌న‌. అంతేకాదు, ఓ విద్యార్థి కూడా ఈ క్ర‌మంలో తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రోప‌క్క‌, సాంకేతిక ప‌నులు చూస్తున్న ఓ సంస్థ ప్ర‌తినిధిని 30 నిమిషాల పాటు నిర్బంధించ‌డంతోపాటు ఆయ‌న నుంచి బ‌లవంతంగా సంత‌కాలు సేక‌రించార‌ని రిజిస్ట్రార్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఎస్వీ యూనివ‌ర్సిటీ అధికారుల‌కు వ్య‌తిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళ‌న ప్రారంభించాయి. దీంతో వ‌ర్సిటీ ప‌రువు మొత్తంగా తుడిచి పెట్టుకుపోయింద‌నే వ్యాఖ్య‌లు బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రిదీనిపై ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో ? చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: