దేశానికి ఉన్న‌త స్థాయి నైపుణ్యాల‌తో కూడిన భావి భార‌త పౌరుల‌ను అందించాల్సిన యూనివ‌ర్సిటీలు ఇటీవ‌ల కాలంలో వివాదాల‌కు కేంద్రాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా యూనివ‌ర్స‌టీలు విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాట‌మాడుతున్నాయనే వ్యాఖ్య‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఫ‌లితంగా విద్యార్థుల‌ను తీర్చిదిద్దాల్సిన వ‌ర్సిటీలు వారిపాలిట మ‌ర‌ణ శాస‌నాల‌ను లిఖిస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తిరుప‌తి కేంద్రంగా రాష్ట్రంలో స‌మున్న‌త విద్య‌ను అందించే శ్రీవేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌య విద్యార్థి ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీనికి యూనివ‌ర్స‌టి త‌ప్పిదాలే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.


విష‌యంలోకి వెళ్తే.. డిగ్రీ రెండో సంవ‌త్స‌రం సెమిస్ట‌ర్ ఫ‌లితాల్లో త‌ప్పులు దొర్లాయి. దీంతో చాలా మంది విద్యార్థుల‌కు అన్యాయం జ‌రిగింద‌నే వాద‌న బ‌లంగావినిపిస్తోంది. ఈ క్ర‌మంలో చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రాంతానికి చెందిన హ‌రి(19) డిగ్రీ రెండో సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లో ఫెయిల్ అయ్యారు. దీనిని అవ‌మానంగా భావించిన ఆ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అయితే,దీనికి కార‌ణం ఎస్సీ వ‌ర్సిటీ అనుస‌రించిన వైఖ‌రేన‌ని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప‌రీక్ష‌ల విభాగం అధికారులు చేసిన త‌ప్పుల కార‌ణంగానే హ‌రి ఫెయిల్ అయ్యాడ‌ని, ఆయ‌న మ‌ర‌ణానికి ఎస్వీ యూనివ‌ర్సిటీ బాధ్య‌త వ‌హించాల‌ని కోరుతూ.. విద్యార్థి సంఘాలు ఉద్య‌మాల‌కు పిలుపు నివ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది.


ఎస్వీయూలో ఏప్రిల్‌, మే నెల‌ల్లో నిర్వ‌హించిన రెండోసెమిస్ట‌ర్ ప‌రీక్ష ఫ‌లితాల‌నుగ‌త‌ శ‌నివారం రాత్రి విడుద‌ల చేశారు. అయితే, ఈ ఫ‌లితాల్లో త‌ప్పులు దొర్లాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఇంట‌ర్న‌ల్‌, ఎక్స్‌ట‌ర్న‌ల్ మార్కులు విడివిడిగా ఉంటాయి. ఇంట‌ర్న‌ల్ మార్కుల‌ను సంబంధిత క‌ళాశాల‌లు ఎస్వీయూకు పంపుతాయి.  ఎక్స్‌ట‌ర్న‌ల్ మార్కుల‌ను యూనివ‌ర్సిటీనే మూల్యాంక‌నం చేస్తుంది. ఫ‌లితాల విడుద‌ల స‌మ‌యంలో ఈ రెండు మార్కుల‌ను క‌లిపి ప్ర‌క‌టించాలి. అయితే, శ‌నివారం విడుద‌లైన ఫ‌లితాల్లో చాలా మంది విద్యార్థులు ఫెయిల‌య్యారు.


త‌మకు సంబంధించిన ప్రాక్టిక‌ల్‌(ఇంట‌ర్న‌ల్‌) మార్కుల‌ను ఎక్స్‌ట‌ర్న‌ల్ మార్కుల‌తో క‌ల‌ప కుండా నే ఫ‌లితాలు ప్ర‌క‌టించార‌ని విద్యార్థులు ఆరోపించారు. ఒక్క ఇంగ్లీష్ స‌బ్జెక్టుకు సంబందించిన మార్కుల‌ను 270 మందికి ఇంట‌ర్న‌ల్ మార్కులు క‌ల‌ప‌కుండానే ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల ఫెయిల్ అయ్యారు. అంతేకాదు, ఈ మార్కులు క‌ల‌పాల్సిన చోట `ఏ`(ఆబ్జెంట్‌) అని పెట్టి ఫ‌లితాలు విడుద‌ల చేశారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా హ‌ర్ట్ అయ్యారు. విష‌యం తెలిసిన విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌కు దిగాయి. ఎస్ ఎఫ్ ఐ, ఏ ఐ ఎస్ ఎఫ్ సంఘాలు ఈ వ్య‌వ‌హారాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించాయి.


ఈ క్ర‌మంలోనే హ‌రి అనే విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. విష‌యం తెలిసిన ఎస్వీయూ.. సెమిస్ట‌ర్ ఫ‌లితాల్లో జ‌రిగిన త‌ప్పుల‌కు బాధ్యుల‌ను చేస్తూ.. న‌లుగురికి మెమో ఇచ్చారు. ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్‌, సూప‌రింటెండ్‌, ఇద్ద‌రు క్ల‌ర్కుల‌కు మెమోలు ఇచ్చారు. మొత్తానికి త‌ప్పు జ‌రిగిన త‌ర్వాత దిద్దు బాటు చ‌ర్య‌ల‌కు దిగినా.. విద్యార్థి ప్రాణం పోయిన ఘ‌ట‌న మాత్రం ఎస్వీయూకి మ‌చ్చ‌లా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: