ప్రపంచ వ్యాప్తంగా అధ్యాపక వృత్తికి విద్యాలయాలకు ఎంతో గౌరవం ఉంది. పాఠశాలలు, కళాశాలల కంటే విశ్వవిద్యాలయాల్లో ఈ గౌరవం ఇంకాస్త ఎక్కువ. ఎందుకంటే.. యవతీయువకులను సరైన మార్గంలో నడిపి వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేసేది ఇక్కడే. అందులోనూ అధ్యాయపకుల కంటే.. ఈ విశ్వవిద్యాలయాలను నడిపించే వారి బాధ్యత ఇంకాస్త ఎక్కువ. వారు తీసుకునే చర్యలు వందలు, వేల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తాయి.


అందుకే కొన్ని యూనివర్శిటీలకు అంతులేని పేరు ఉంటుంది. అక్కడ చదవడమే గొప్ప భాగ్యం అన్నట్టు ఉంటుంది. కానీ పవిత్ర తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మాత్రం అలాంటి పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదట. గతమెంతో ఘనమైనా ప్రస్తుతం మాత్రం నానాటికీ తీసికట్టు తరహాలోనే ఉందంటున్నారు.


ఇక్కడ అధ్యాపకులు సంగతి ఏమో కానీ.. యూనివర్శిటీ పాలన చూస్తున్న అధికారుల్లో అలాంటి లక్షణాలు కనిపించడం లేదట. అలాంటి నైతిక సూత్రాలు, నీతి నియమాలు, నిబద్ధత బూతద్దం పెట్టి వెతికినా మీకు కనిపించవంటే అతిశయోక్తి కాదని తిరుపతి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


విద్యార్థులుగా ఈ ప్రాంగణంలోకి వచ్చిన వారిని.. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎలా తీర్చిదిద్దాలి.. భవిష్యత్ పై ఎంతో ఆశతో విశ్వ విద్యాలయంలోకి అడుగుపెట్టిన వారికి ఎలాంటి శిక్షణ అందించాలి. విశ్వ విద్యాలయం గేటు దాటగానే ఆ విద్యార్థి భవిష్యత్ కు భరోసా కలిగించేలా విద్యాప్రణాళికలు ఎలా రూపొందించాలి.. వాస్తవానికి ఇవీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆలోచనలు ఈ దిశాగా ఉండాలి. అప్పుడే ఈ విశ్వవిద్యాలయం నిజమైన విద్యాలయంగా మారుతుంది.


కానీ ఇక్కడి రిజిస్ట్రార్ కు మాత్రం ఇవేమీ పట్టేలా లేవట. ప్రస్తుతం ఇంచార్జిగా వచ్చిన వ్యక్తికి ఇలాంటి నైతిక ప్రవర్తన కంటే.. కాసులు వచ్చే పనులపైనే మక్కువ ఎక్కువని ఇప్పటికే యూనివర్శిటీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మనీపై ఉన్న శ్రద్ధలో నాలుగోవంతు ఆయన యూనివర్శిటీపై పెట్టినా.. ఇక్కడి విద్యార్థుల తలరాతలు మారుతాయని అంటున్నారు. మరి ఇంచార్జి రిజిస్ట్రార్ మనసు మారేదెన్నడో.. ఈ విశ్వ విద్యాలయం బాగుపడేదెన్నడో అని తిరుపతికి చెందిన విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: