కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 వ తేదీ నుండి కొత్త మోటారు వాహనాల చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత చాలా ప్రాంతాలలో లక్షల్లో జరిమానాలు విధిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. వాహనం విలువ కంటే జరిమానానే అధికంగా ఉండటంతో ఆశ్చర్యపోవటం వాహనదారుల వంతు అవుతుంది. కొందరు సంపాదిస్తున్న నెల జీతం కంటే చెల్లించాల్సిన జరిమానానే ఎక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ చట్టం అమలులోకి రాకముందే భువనేశ్వర్ లో 6.53 లక్షల రుపాయల జరిమానా విధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడని భువనేశ్వర్ కు చెందిన దిలీప్ కర్తా అనే డ్రైవర్ కు 6.53 లక్షల జరిమానా విధించారు. ఈ డ్రైవర్ మొత్తం ఏడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడని తెలుస్తోంది. ఏడు నిబంధనలు ఉల్లంఘించటంతో సాంబాల్ పూర్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో చలానా జారీ చేసారని తెలుస్తోంది. గడచిన ఐదు సంవత్సరాల నుండి రోడ్డు ట్యాక్స్ కట్టని కారణంతో 6,40,500 రుపాయలు జరిమానా వేసారని తెలుస్తోంది. 
 
రోడ్డు ట్యాక్స్ మాత్రమే కాకుండా వస్తువులను మాత్రమే తరలించాల్సిన వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోవటం, తప్పు చేసినప్పటికీ తప్పను అంగీకరించకపోవటం వలన జరిమానా 6.53 లక్షలు అయిందని తెలుస్తోంది. ఆగస్టు నెల 10 వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత జరిమానా విధించి ఉంటే మాత్రం ట్రక్కు యజమానికి జరిమానా భారీగా పెరిగేదని చెప్పవచ్చు.


కొత్త చట్టం అమలు విషయంలో చాలా రాష్ట్రాలు వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో జరిమానాలను సగానికి సగం తగ్గించటం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సంవత్సరం చివర్లో ఎన్నికలు ఉండటం వలన కొత్త మోటారు వాహనాల చట్టంను అమలు చేయలేమని ఆ రాష్ట్రాలు కేంద్రానికి చెబుతున్నట్లు తెలుస్తోంది. 





మరింత సమాచారం తెలుసుకోండి: