ఇండియాలో ఉండాలంటే హిందీ తప్పక నేర్చుకోవాలి అనే మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది భారతదేశంలో ఉన్న భిన్నత్వాన్ని చంపేయడమే అనే వాదన బలంగా వినిపిస్తుంది. భారతదేశం ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఈ దేశంలో ఉన్న విభిన్న సంస్కృతుల మూలంగానే. అలాంటిది  ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ సంస్కృతులను అగాధంలో పడేసే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.


 హిందీ మన రాజ భాష కాదు. ఇండియాకి రాజ భాష లేదు. దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఆ భాష మాట్లాడే వారి వెనక ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రలు ఎంతో గొప్పవి. అలాంటిది ఆ చరిత్రల ఉనికికే భంగం కలిగేలా చేస్తానంటే ఎవరూ ఊరుకోరు. మన భారతదేశం ఒక అడవి లాంటిది. అడవిలో అడుగు అడుగునా అద్భుతం కనబడినట్టు మన దేశంలో ప్రాంతం ప్రాంతానికి అద్భుతాలు దర్శనమిస్తాయి. అలాంటి అద్భుత వనాన్ని కాలనీలో రోజూ చూసే పార్క్ ల చేద్దామనే కేంద్ర ప్రభుత్వ ఆలోచన అస్సలు బాగాలేదు.


హిందీని ఎంత రుద్దే ప్రయత్నం చేస్తే అంతకన్నా ఎక్కువగా వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా దక్షిణాదిన మాతృ భాషలు ఎంతో కీలకం. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషలే కాకుండా ఇంకా ఎన్నో భాషలు మాట్లాడే వారు ఇక్కడ ఉన్నారు. హిందీని బలవంతంగా రుద్దితే మన మాతృ భాషల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. మాతృ భాషని కోల్పోవడం అంటే మన అస్థిత్వాన్ని కోల్పోవడమే. మన అస్థిత్వాన్ని కోల్పోవడం అంతే మనల్ని మనం కోల్పోవడమే.


మన అమ్మని ఏ విధంగా మర్చిపోలేమో అమ్మ భాషని కూడా మర్చిపోలేము. తెలుగు భాష మాట్లాడే తెలుగు వాళ్ళు తమ యాసని కించపరుస్తున్నారని రాష్ట్రాన్నే వేరుచేసుకున్నారన్న విషయం కేంద్ర ప్రభుత్వం మర్చిపోకూడదు. దేశం మొత్తం ఒకే భాష అనుకుంటే హిందీనే ఎందుకు? తెలుగు నేర్చుకోమనండి. తమిళం నేర్చుకోమనండి. దేశంలో ఎన్ని ఎక్కువ భాషలు ఉంటే అంత ఎక్కువ మంచిది. ఆయా భాషల ఉనికిని కాపాడావలసిన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యకరం.


మరింత సమాచారం తెలుసుకోండి: