పొరుగు దేశ‌మైన పాకిస్థాన్‌కు ఆల‌స్యంగా భార‌త్ విష‌యంలో క‌నువిప్పు క‌లుగుతోంది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామన్న పాకిస్థాన్ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇజాజ్ అహ్మద్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కశ్మీర్ అంశంలో యావత్ ప్రపంచం భారత్ వాదననే సమర్థిస్తున్నదని.. పాకిస్థాన్‌ను ఎవరూ నమ్మడం లేదని ఇజాజ్ పేర్కొన్నారు. ఈ ప‌రిస్థితి పాక్ స్థితిని తేట‌తెల్లం చేస్తోంది. 


ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు. మందులు లేకుండా కశ్మీరీలు ఇబ్బందులు పడుతున్నారు.. అని మేము(పాక్) చెబుతూనే ఉన్నాం. కానీ, మా మాటల్ని ఎవరూ నమ్మడం లేదు. ప్రపంచమంతా భారత్‌నే విశ్వసిస్తున్నది`` అని పేర్కొన్నారు. త‌ద్వారా క‌శ్మీర్ విష‌యంలో త‌మ త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని ఆయ‌నే ఒప్పుకొన్నారు. 


ఇదిలాఉండ‌గా, పాకిస్థాన్ లోగుట్టు రట్టయ్యింది. ఉగ్రవాద సంస్థలతో ఆ దేశానికి ఉన్న సంబంధాలు మరోసారి బట్టబయలయ్యాయి. పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి బ్రిగేడియర్ ఇజాజ్ అహ్మద్ షా ఓ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా(జేయూడీ)ను జన జీవన స్రవంతిలోకి తెచ్చేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చుపెట్టిందని ఆయన తెలిపారు. జేయూడీపై కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం. నిషేధిత సంస్థకు చెందిన సభ్యులు ప్రధాన స్రవంతిలోకి రావాలని మేం ఆశిస్తున్నాం అని షా చెప్పారు. ఇమ్రాన్‌ఖాన్ జూలైలో అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ దేశంలో సుమారు 30,000 నుంచి 40,000 మంది ఉగ్రవాదులు ఉన్నారని ఆయన ఒప్పుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లేదా కశ్మీర్‌లో పోరాటానికి వారంతా శిక్షణ పొందినట్లు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: