ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి 100 రోజుల పాటు దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటూ ఎలాంటి టెన్ష‌న్లు లేకుండా ప్ర‌శాంతంగా పాల‌న చేసుకుంటున్నాడు. ఇక ఓ వైపు బీజేపీ జ‌గ‌న్‌ను టార్గెట్‌గా చేసుకుని ఢిల్లీ కేంద్రంగా సైతం రాజ‌కీయాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ సైతం ఇత‌ర పార్టీల్లో ఉన్న బ‌ల‌మైన నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకునేందుకు గేట్లు ఎత్త‌క త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే టీడీపీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు వైసీపీలో చేరుతున్నారు.


ఇప్ప‌టికే అడారి ఆనంద్ కుమార్‌, పిల్లా ర‌మాదేవి వైసీపీలో చేరిపోయారు. తాజాగా ఆదివారం టీడీపీకి చెందిన బ‌ల‌మైన నేత‌, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిపోయారు. తోట వైసీపీలో చేర‌డంతో జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది. తూర్పు గోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు మూడు ముక్క‌లాట త‌ప్పేలా లేదు.


ఇప్ప‌టికే అక్క‌డ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ వ‌ర్గంతో పాటు ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ వ‌ర్గాలు ఉన్నాయి. ఇక తోట వీళ్లిద్ద‌రి మీద ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. టీడీపీలో ఉన్న ఆయ‌న కూడా వైసీపీలోకి వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు వైసీపీలో ఆ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా ఏకంగా మూడు వ‌ర్గాలు ఉన్న‌ట్ల‌య్యింది. ఈ ముగ్గురు మూడు భిన్న‌మైన ధృవాల‌కు చెందిన వారు. వీరి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డం జ‌గ‌న్‌కు పెద్ద స‌వాల్ లాంటిదే.


తోట‌ను పార్టీలో చేర్చుకోవ‌డం ఇష్టంలేని పిల్లి బోస్‌, చెల్లుబోయిన వేణు వ‌ర్గాలు ఇప్ప‌టికే ఉమ్మ‌డిగా స‌మావేశం నిర్వ‌హించుకుని జ‌గ‌న్ వ‌ద్ద పంచాయితీకి రెడీ అవుతున్నాయి. ఇక బోస్ మాత్రం లోప‌ల తోట‌ను చేర్చుకోవ‌డం ఇష్టం లేక‌పోయినా తమ ప్రత్యర్థి నేతను పార్టీలోకి ఆహ్వానించడం.. త‌మ‌కు హ్యాపీయే అని.. తమ పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని చెప్పారు.


ఇక పార్టీలో చేరిన తోట తూర్పుగోదావ‌రి జిల్లా వైసీపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆశిస్తుండ‌గా జిల్లాకు చెందిన వైసీపీ నేత‌లు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఈ ముగ్గురు నేత‌ల‌తో పాటు తోట‌కు మిగిలిన జిల్లా నేత‌ల‌తో స‌యోధ్య కుద‌ర్చ‌డం జ‌గ‌న్‌కు క‌త్తిమీద స‌వాల్ లాంటిదే.


మరింత సమాచారం తెలుసుకోండి: