బీజేపీ విషయం తీసుకుంటే ఆశ లావు పీక సన్నం సామెత గుర్తుకువస్తుంది. నిజానికి బీజేపీ ఆశలు ఎలా ఉంటాయంటే మబ్బులో నీళ్ళు చూసి ముంతలు నిండుతాయనుకునే రకంగా ఉంటాయి. ఏపీలో బీజేపీ ఇవాల్టిది కాదు, దాని పరుగులు కూడా ఈనాటివి కావు. కేంద్రంలో బీజేపీ ఇప్పటికి పలు మార్లు అధికారంలోకి వచ్చింది. వాజ్  పేయ్ ఆరేళ్ళు పాలించారు. మోడీ రెండవ టెర్మ్ కూడా పాలిస్తున్నారు. ఎన్నడూ లేని మంచి వాతావరణం బీజేపీకి ఇపుడు దేశంలో ఉంది.


అయితే ఏపీలో మాత్రం బీజేపీకి అవకాశాలు లేవు. ఎందుకంటే ఇక్కడ  ఇతర పార్టీలకు పటిష్ట‌మైన నాయకత్వం ఉంది. అటు అధికారంలో వైసీపీ, ఇటు ప్రతిపక్షంలో టీడీపీ బలంగా వేళ్ళూనుకుని ఉన్నాయి. మధ్యలో దూరిపోదామంటే కుదిరే వ్యవహారం అసలు కాదు, ఇక బీజేపీలోకి వస్తున్న నాయకులు కూడా తమ రాజకీయ పబ్బం గడుపుకునే వారే తప్ప పార్టీ కోసం పనిచేసేవారు కాదు, వారికి కూడా ఏపీలో ఎటువంటి బలం సొంతంగా లేదన్న సంగతి అందరికీ తెలిసిందే.


ఇదిలా ఉండగా కేంద్రంలో మోడీ రెండవ మారు అధికారంలోకి ఇలా వచ్చారో లేదో అలా నలుగురు టీడీపీ రాజ్యసభ  ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. దాంతో ఎగిగి గంతేసిన బీజేపీ ఏపీలో తామే పెద్ద పార్టీ అనుకుంది. ఎంతో మంది వెల్లువలా వస్తారని కూడా ఆశించింది. అయితే ఇపుడు ఒక్కొక్కరుగా వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ఈ రోజు చేరిన తోట త్రిమూర్తులుని కూడా బీజేపీలో చేరమని ఎంతో వత్తిడి చేసినా ఆయన వైసీపీ వైపే మొగ్గు చూపారు.


మరో వైపు కొంతమంది నాయకులు తాము బీజేపీలోకి వస్తే ఏమిస్తారని కూడా డిమాండ్ చేస్తున్నారుట. తమకు రాజ్య సభ సభ్యత్వాలు కావాలని, నామినేటెడ్ పదవులు కావాలని బేరాలు పెడుతున్నారట. పోనీ వారికి బలం ఎంత అని చూసుకుంటే పెద్దగా కలిసొచ్చేది ఏదీలేదని తేలుతోందట. ఈ నేపధ్యంలో ఓ టీడీపీ మహిళా నాయకురాలు కూడా తనకు కేంద్రంలో కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తే జంప్ చేస్తానని చెప్పిందట.


దీంతో తలపట్టుకోవడం బీజేపీ పెద్దల వంతు అయిందట. ఇక బీజేపీలో మొదటి నుంచి వున్న వారి సంగతి తీసుకుంటే వారంతా ఈ జంపింగ్ జఫాంగుల రాకతో  తెగ చికాకు పడుతున్నారట. వారిని చేర్చుకుంటే పార్టీకి  ఏమి వస్తుందని కూడా అంటున్నారుట. ఓ వైపు ఇలా లుకలుకలు ఉంటే మరో వైపు చేరికల్లోనూ షరతులు, డిమాండ్లు చూసి బీజేపీ పెద్దల గుండె బేజారవుతోందట. మొత్తానికి ఏపీలో బీజేపీ ఇప్పటికి కూడా సరైన బోణీ కొట్టలెదని వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: