మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దఎత్తున పెట్టుబడులు పెడితే ఉద్యోగావకాశాలు పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని సిపిఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. ప్రభుత్వరంగ పెట్టుబడులు పెంచి ఉద్యోగ, ఉపాధి కల్పన చేసి, ప్రజల కొనుగోలు శక్తి పెంచితేనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని తెలిపింది. ఈ మేరకు ఆదివారం సిపిఎం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక వ్యవస్థ వేగవంతం చేస్తామంటూనే  పెట్టుబడిదారులకు మరిన్ని తాయిలాలు ప్రకటించి సామాన్యులకు మొండిచేయి చూపిందని సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర  స్థాయిలో విమర్శించింది.



లాభాలన్నీ పెట్టుబడిదారులకు కట్టబెట్టి, ప్రజలను ఇబ్బందుల పాలుచేసే మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఆర్థికవ్యవస్థ మందగమనానికి ఆర్థిక మాంద్యమే ప్రథమ కారణమని ఆర్థికమంత్రి ప్రకటించారని తెలిపింది. రియాల్టీ రంగంలో ప్రయివేటు పెట్టుబడులు, భారీగా ఎగుమతుల పెంపుపైనే కేంద్రీకరించడం వల్ల విజయవంతం కాలేమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం తగ్గుతోందని తెలిపింది. ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గిపోయిన పరిస్థితుల్లో ఇళ్ల కొనుగోళ్లు ఎలా పెరుగుతాయని ప్రశ్నించింది. రూ.70 వేల కోట్ల విలువైన ప్యాకేజీలను శుక్రవారం నిర్మలా సీతారామన్‌ ప్రకటించడాన్ని  ఈ సందర్బంగా ప్రస్తావించింది.




ప్రభుత్వరంగ పెట్టుబడులు పెంచి, మహాతాగాంధీ నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ గ్యారంటీ స్కీమ్‌ (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) బకాయిలు చెల్లిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని పేర్కొంది. ప్రజలను ఇబ్బందుల పాలు చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. హిందీ జాతీయ భాషగా గుర్తించాలంటూ అమిత్‌ షా చేసిన ప్రకటన భారత రాజ్యాంగం, భిన్న భాషల స్ఫూర్తికి విరుద్ధమని సిపిఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. హిందీ రుద్దడాన్ని వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చింది.  రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో అన్ని భాషల జాబితా ఉందని, జాతీయ భాషలన్నింటినీ సమానంగా గుర్తించిందని తెలిపింది. బలవంతంగా రుద్దే ఏ భాష మనదేశ ఐక్యతను, సమగ్రతను కాపాడలేదని స్పష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: