ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి అంశం హాట్ టాపిక్. అయిదు కోట్ల ఆంధ్ర ప్రజలు కూడా ఆమరావతి ఎప్పుడేం జరుగుతుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందోనని భూములిచ్చిన రైతుల్లో ఆందోళన కూడా ఉంది. రాజధానిపై బొత్స చేసిన వాఖ్యలు దీనిపై మరింత ఆజ్యం పోశాయి. అమరావతిపై ప్రభుత్వం తరపున మాట్లాడుతున్న మంత్రి బొత్స తాజాగా మరింత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

 

 

 

టీడీపీ హయాంలో అమరావతిలోని ప్రభుత్వ నిర్మాణాల డిజైన్ల కోసం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి సలహాలు తీసుకోవటం తెలిసిందే. జక్కన్నను అమరావతికి రప్పించి మరీ దీనిపై ప్రెజంటేషన్ ఇప్పించారు అప్పటి ముఖ్యమంత్రి. ఈ అంశంపై మంత్రి బొత్స స్పందించారు. "తెలుగులో దాసరి తర్వాత రాజమౌళినే ఆ స్థాయి దర్శకుడిని.. ఇందులో సందేహం లేదు. కానీ.. రాజధాని నిర్మాణంలో మాత్రం ఆయన సలహాలు అవసరం లేదు. ఆయన గొప్ప సినిమాలు తీయగలడు. గత ప్రభుత్వం అత్యుత్సాహం చూపింది" అని అన్నారు. బొత్స చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. బాహుబలి సినిమాలో రాజమౌళి తనకేం కావాలో చెప్పి ఆర్ట్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ డిపార్ట్ మెంట్స్ నుంచి రాబట్టుకున్నాడు. ఆ సినిమాలోని భవంతుల నిర్మాణాలు ఈయన డిజైన్ చేసినవి కాదు. ఆలోచిస్తే ఈ విషయం అందరికీ అవగతమే. కానీ.. అప్పటి సీఎం అత్యుత్సాహం ప్రదర్శించి ఎన్ని విమర్శలు ఎదురైనా పట్టించుకోలేదు.

 

 

 

'ఎన్నో దేశాలు పర్యటించి, ఎన్నో అకృతులు పరిశీలించి చివరికి సినీ దర్శకుడి సలహాలు స్వీకరించాల్సి వచ్చింది' అనే విమర్శను మోయాల్సి వచ్చింది. ఇప్పుడు అధికారం కోల్పోవడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ అంశాన్ని సంబంధిత మంత్రి ప్రస్తావించారు. రాజధానిపై సీఎం ప్రస్తుతం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆరు నెలల్లో ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: