నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది.  యురేనియం తవ్వకాలతో ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా విస్పష్టమైన ప్రకటన చేశారు.  దీనిపై సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిస్తామని చెప్పుకొచ్చారు.  గత కొన్ని రోజులుగా సేవ్ నల్లమల అంటూ సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  ఇక యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా స్థానికులు  రోడ్లపైకి వచ్చి ఆందోళనలు,  నిరసన ప్రదర్శనలు,  ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా యురేనియం తవ్వకాలపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. యురేనియం తవ్వకాలకు అనుమతి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తే  అవకాశం ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్,  గత ప్రభుత్వాలపైన నెపం నెడుతూ  యురేనియం తవ్వకాలు అనుమతించేది లేదంటూ తేల్చి చెప్పారు.  నల్లమల అడవుల ను కాపాడే బాధ్యతను కూడా తామే  తీసుకుంటామని చెప్పుకోవడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలను పంపే ప్రయత్నం చేశారు . అయితే నల్లమల పరిరక్షణ కోసం తాము ఉద్యమించడం వల్లే టీఆరెస్ సర్కార్ దిగివచ్చి , యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చేది లేదని అసెంబ్లీ వేదికగా ప్రకటించిందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు .


 ఇక యురేనియం తవ్వకాలకు తాము అనుమతించింది లేదన్న మంత్రి కేటీఆర్,   గత కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించిందని ... చెప్పాల్సిన విషయాన్ని చెప్పి , తాము ఈ విషయాన్నిరాజకీయం చేయదల్చుకోలేదని అన్నారు . కాంగ్రెస్ నేతలు మాత్రం రాజకీయం చేస్తున్నారని విమర్శించారు . ప్రతిపక్ష నాయకులు కొందరు యురేనియం అన్వేషణపై  బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు . ప్రజల్లో భయాందోళనను సృష్టిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: