రాష్ట్ర విభజన ప్రక్రియ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబును అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోంది. ఈయన రెండు కళ్ల సిద్ధాంతం అని అంటూ రెండు ప్రాంతాల్లోనూ పార్టీని కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ... ఆ ఫార్ములా అంత సక్సెస్ కాదు అని తెలుగుదేశం నేతలు నమ్ముతున్నారు. అందుకే ఏ ప్రాంతానికి తగ్గట్టుగా వారు సమైక్యవాదాన్ని, తెలంగాణ వాదాన్ని వినిపింపే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పుట్టింది..తెలుగు ప్రజలకోసం పనిచేస్తుంది.. అని అంటున్నారు చంద్రబాబు. పార్టీకి, పార్టీ అధినేతగా తనకు తెలంగాణ, సీమాంధ్ర అనే తారతమ్యాలు లేవని.. తనను విశ్వైక నరుడిగా పరిగణించాలని కోరుతున్నాడు ఆయన. అందుకే రెండు ప్రాంతాలూ తనకు రెండు కళ్లలాంటివని.. ఏ కంటికి అన్యాయం జరిగినా సహించలేని, సీమాంధ్రులు, తెలంగాణ ప్రజలకు తనకు ఇద్దరు పిల్లల్లాంటి వారని, ఎవరికి బాధకలిగినా తాను సహించలేనని బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరి ఈ సిద్ధాంతం ప్రజలను ఎంత వరకూ ఆకట్టుకొంటోంది? బాబు ఇమేజ్ ను ఎంత వరకూ పెంచుతోంది? రాష్ట్ర విభజన దాదాపు ఖాయమైన నేపథ్యంలో బాబుకు ఎలాంటి ఇమేజ్ ను క్రియేట్ చేస్తోంది? అనే విషయాలు అంత ఈజీగా అర్థం కావు. అయితే ఈ సిద్ధాంతం తెలుగుదేశం శ్రేణులను ఎంత వరకూ ప్రభావితం చేస్తోంది? అనే అంశాన్ని పరిశీలిస్తే ఈ విషయంలో కొంత క్లారిటీ వస్తుంది. తెలుగుదేశం అధినేత చెబుతున్న రెండు కళ్ల సిద్ధాంతం పట్ల తెలుగుదేశం పార్టీలోనే నమ్మకం కలగడం లేదనిపిస్తుంది. ఎందుకంటే.. బాబు సమైక్యవాదానికి లేదా తెలంగాణ వాదానికి కట్టుబడటం లేదు కాబట్టి.. తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా అలాగే వ్యవహరించాల్సి ఉంది! తమ నాయకుడు చెబుతున్న రెండు కళ్ల సిద్ధాంతాన్నే అటు సీమాంధ్ర నేతలు, ఇటు తెలంగాణ నేతలు ఫాలో అవ్వాల్సి ఉంది. కానీ.. బాబు ఇలా చెబుతుంటే.. సీమాంధ్ర ప్రాంత నేతలు సమైక్యవాదం అని అంటున్నారు, తెలంగాణ ప్రాంత నేతలు చంద్రబాబు కూడా తెలంగాణ వాదానికి కట్టుబడే ఉండాలని అంటున్నారు! లేకపోతే తాము తమదారి చూసుకొంటామని హెచ్చరిక చేస్తున్నారు. మరి దీన్ని బట్టి చంద్రబాబు చెబుతున్న రెండు కళ్ల సిద్ధాంతం తెలుగుదేశం పార్టీలోనే పూర్తిగా సక్సెస్ కావడం లేదని అనుకోవచ్చు. బాబు చెబుతున్న థియరీని తెలుగుదేశం నేతలు ఫాలో కావడం లేదని అనుకోవచ్చు! మరి ఇది ప్రజల్లో గానీ సక్సెస్ అవుతుందా?!  

మరింత సమాచారం తెలుసుకోండి: