ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రస్తుతం చాలా స్నేహంగా ఉంటున్నారు. ఎన్నికల ముందు నుంచి కూడా వీరిద్దరూ స్నేహంగా ఉంటున్నారు. ఎన్నికల తర్వాత ఆ స్నేహం మరింత పెరిగింది. ఏపీలో జగన్ గెలవడంతో కేసీఆర్ ఫుల్ ఖుషీ అయ్యారు. తన చిరకాల ప్రత్యర్థిని జగన్ చిత్తు చేయడం ఆయనకు పట్టరాని సంతోషాన్నిచ్చింది.


జగన్ సీఎం అయ్యాక ఏపీ, తెలంగాణ సంబంధాల్లోనూ చాలా విప్లవాత్మక మార్పులొచ్చాయి. గతంలో ఉప్పు,నిప్పుగా ఉండే ఈ రెండు రాష్ట్ట్రాలు ఇప్పుడు ఇద్దరు సీఎంల స్నేహం పుణ్యమా అని బాగా సహకరించుకుంటున్నాయి. తాజాగా ఈ రెండు రాష్ట్రాలు నీటి విషయంలోనూ సహకరించుకోవాలని నిర్ణయించాయి. గోదావరి జలాలను రెండు రాష్ట్రాలు కలసి సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాయి.


ఈ విషయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు.. ఏపీలో నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకొనేందుకు ఆంధ్రా సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ సహాయ సహకారాలు కోరారని తెలిపారు. రెండు రాష్ట్రాల రైతుల అభ్యున్నతి కోసం తాము కూడా పాత పంచాయితీలను పక్కన పెట్టి కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యామని తెలిపారు.


ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఏపీతో కలిసి గోదావరి-కృష్ణా అనుసంధానానికి సిద్ధమయ్యాం. దుమ్ముగూడెం వద్ద బ్యారేజీని ప్రతిపాదిస్తున్నాం. ఈ మేరకు త్వరలోనే మళ్లీ ఆంధ్రా ఇంజినీర్లతో సమావేశమవుతాం. దీనివల్ల ఖమ్మం జిల్లాకు కూడా శాశ్వత ప్రయోజనాలు కాపాడినట్లవుతుంది. ఇక్కడ 35 నుంచి 40 టీఎంసీల నీరు ముంపు సమస్య లేకుండా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు నదుల అనుసంధానం జరిగితే ఇక రెండు రాష్ట్రాలకు నీటి సమస్య ఉండదు.. అన్నారు.


కేసీఆర్ మాటలను బట్టి చూస్తే.. గోదావరి జలాల సద్వినియోగం కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలన్న ప్రతిపాదన జగన్ నుంచే వచ్చినట్టు అనిపిస్తోంది. జగనే తనను కోరారని.. తాను కూడా అందుకు సుముఖంగా ఉన్నానని కేసీఆర్ చెబుతున్నారు. ఎవరు ముందు ప్రతిపాదించినా చివరకు రెండు రాష్ట్రాలకు మంచి జరగడమే కావాల్సింది. సముద్రంలో కలుస్తున్న వందల టీఎంసీల నీరు రెండు రాష్ట్రాలకు ఉపయోగపడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: