అధికార టీఆర్ఎస్‌ రూట్ లోనే బీజేపీ పయనించేందుకు రెడీ అయ్యింది. ఇతర పార్టీల నుంచి నాయకులను గులాబీదళంలోకి లాక్కున్నట్లుగానే కమలనాథులు సైతం ప్రయత్నాలు ప్రారంభించారు. సింగరేణిలో టీబీజీకేఎస్‌ను చీల్చాలనే బీజేపీ లక్ష్యం నెరవేరింది. యూనియన్‌లో కీలక నేత కెంగర్ల మల్లయ్య రాజీనామాతో సింగరేణిలో గులాబీ పార్టీ పట్టు ప్రశ్నార్థకమైంది. తనకు సరైన గుర్తింపు లేకపోవటంతోనే పార్టీని వీడతున్నట్టు ఆయన ప్రకటించారు. 


తెలంగాణలోని సింగరేణి ప్రాంతాలపై బిజేపీ ఫోకస్ పెట్టింది. బొగ్గు గనుల్లో బలం పెరగాలంటే అధికార టీఆర్ఎస్ అనుబంధ సంఘంలో చీలిక చేయాలనే బీజేపీ వర్కవుట్ అయింది. టీబీజీకేఎస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కెంగర్ల మల్లయ్య రాజీనామా ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. టీబీజీకేఎస్‌కు మల్లయ్య వర్గం నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ నెలాఖరులోగా బీజేపీ అనుబంధ  సంఘమైన బీఎంఎస్‌లో చేరనున్నారు. 


టీఆర్‌ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్‌ మొదటి నుంచి వర్గ పోరుకు వేదికగా మారింది. యూనియన్ నేతలు మిర్యాల రాజిరెడ్డి,  కెంగర్ల మల్లయ్య మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ యూనియన్ గొడవలు పెద్దవి కాకుండా చూసుకున్నారు. వీరి గొడవల మధ్య ఐఎన్టీయూసీ నుంచి వచ్చిన వెంకట్రావుకు స్థానం కల్పించేందుకు సీఎం కేసీఆర్ టీబీజీకేఎస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. దీంతో యూనియన్ లో విభేదాలు మరింత ముదిరాయి. 


నిజానికి... మొదటి నుంచి యూనియన్ పటిష్టానికి పాటుపడ్డ తనకు పదవి ఇవ్వాల్సిందే అని కెంగర్ల మల్లయ్య తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆయనకు పదవి కచ్చితంగా వస్తుంది అని అధిష్టానం కూడా లీకులు ఇచ్చింది. కెంగర్ల మల్లయ్య ఎమ్మెల్యే బాల్క సుమన్ ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు...కెంగర్ల అనుచరుల నుంచి యూనియన్ వీడి బయటకు వెళ్లాలని ఒత్తిడి పెరిగింది. దీంతో కెంగర్ల బయటకు వెళ్లేందుకే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ రంగంలోకి దిగారు. మంచిర్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్‌ను పంపించి కెంగర్ల మల్లయ్యను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన కొన్ని ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెట్టారు. అదిష్టానం ముందు పెట్టి ప్రతిపాదనలకు ఇచ్చిన గడువు ముగిసినా అక్కడ నుండి స్పందన రాలేదు. దీంతో తన దారి తాను చూసుకోక తప్పదని కెంగర్ల భావించి రాజీనామా బాట పట్టారు. అయితే... ఇది సింగరేణి వ్యాప్తంగా టీఅర్ఎస్‌కు పెద్ద దెబ్బ. ఇప్పటికే పార్టీ వీడిన మాజీ ఎంపీ వివేక్, కెంగర్ల మల్లయ్య ఇద్దరు కలిసి వచ్చే యూనియన్ ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: