టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు సిద్ధమయ్యారు కార్మికులు. APలో ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే... కేసీఆర్ సర్కార్‌ ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదన్నది తెలంగాణ ఆర్టీసీ  కార్మికుల ప్రశ్న. ఇప్పటికే కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు... 17 తర్వాత ఏ క్షణంలోనైనా విధులు బహిష్కరిస్తామంటున్నాయి. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? తెలంగాణలో కూడా టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే అవకాశ ఉందా?  


రైతు బంధు, కళ్యాణలక్ష్మి వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. వాటిని ఆదర్శంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌ సహా పలు తమ వద్ద కూడా అమలుకు శ్రీకారం చుట్టాయి. మరోవైపు... ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ విలీనానికి అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలోనూ ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌ జోరుగా వినిపిస్తోంది. ఏపీతో పోలిస్తే, తెలంగాణలో ఆర్టీసీకి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని, అక్కడి కంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఇక్కడే ఎక్కువ అవసరమంటున్నారు కార్మికులు. కానీ... ఎందుకు విలీనం చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి కార్మిక సంఘాలు.  


ఏపీలో బస్ పాస్ లు, ఇతర రాయితీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని... తెలంగాణలో తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్టీసీకి ఒక్క పైసా కూడా కేటాయించలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు కార్మికులు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని విమర్శిస్తున్నారు ఇంకొందరు. బస్ పాస్ ల రీయింబర్స్‌మెంట్‌ సహా పలు పద్దుల కింద ఆర్టీసీకి ప్రభుత్వం ఏడాదికి 650 కోట్ల రూపాయల వరకూ చెల్లిస్తుంది. గత బడ్జెట్‌లో ఆర్టీసీకి 975 కోట్ల 55 లక్షల రూపాయలు కేటాయించింది తెలంగాణ సర్కారు. ఈ సారి కేటాయింపులేమీ చేయలేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం... బడ్జెట్‌లో మొండి చేయి చూపించడాన్ని కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇలాగైతే సంస్థ కోలుకునేదెలా? అని ప్రశ్నిస్తున్నాయి.  టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఇప్పటికే ఎంప్లాయిస్‌ యూనియన్‌, తెలంగాటీణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ తో పాటు ​మరో ప్రధాన యూనియన్‌ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ​సమ్మె ​నోటీసులు ఇచ్చాయి.   


టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు తమ జీతభత్యాలను పెంచాలని... కోరుతున్నాయి కార్మిక సంఘాలు. ఆర్టీసీకి ఐదు సంవత్సరాల టాక్స్ హాలిడే  ఇవ్వాలన్నది ట్రేడ్‌ యూనియన్ల మరో డిమాండ్‌. అలాగే, ఎరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాయి. తమిళనాడు తరహాలో సంస్థపై పెరుగుతున్న డీజిల్ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా ఖాళీ పోస్టులను భర్తీ చేసి, తమపై పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు కార్మికులు.  





మరింత సమాచారం తెలుసుకోండి: