పాపికొండల విహారయాత్రకు వెళ్ళాలన్న ఆలోచనే తమను శాస్వతంగా విడదీస్తుందని ఆ ప్రాణ స్నేహితులు గ్రహించలేకపోయారు.  దేవిపట్నంకు సమీపంలోని కచ్చలూరు మందం దగ్గర గోదావరి నదిలో  ఆదివారం లాంచి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 71 మందితో ప్రయాణిస్తున్న లాంచి ముణిగిపోయిన ఘటనలో ఇప్పటికి 12 మంది మరణించారు. సుమారు 40 మంది గల్లంతయ్యారు. మిగిలిన వారు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

 

ప్రమాదానికి గురైన లాంచిలో పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంకు చెందిన నలుగురు ప్రాణ స్నేహితులు కూడా ఉన్నారు.  నరసాపురంలోని రుస్తుంబాద ప్రాంతానికి చెందిన వలపల రఘు,  చెట్లపల్లి గంగాధర్, గన్నబత్తుల ఫణికుమార్, మండల గంగాధర్ కూడా ప్రయాణిస్తున్నారు. చాలామంది ప్రకృతి అందాలను ఆస్వాధిస్తున్నట్లే వీరు కూడా పదిమందితో కలిసి చాలా హుషారుగా ఉన్నారు.

 

లాంచిలో రెండస్తులున్నాయి. క్రిందస్తులోని కొందరు భోజనాలు చేస్తున్నారు. పై అంతస్తులో కొందరు తమ పిల్లా, పాపలతో కలిసి డ్యాన్సులు చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు డ్యాన్సులను ఎంజాయ్ చేస్తున్నారు. భోజనాలు చేస్తున్న వారిలో కొందరు, డ్యాన్సులు చేస్తున్న వారిలో కొందరితో పాటు మరికొందరు తమకిచ్చిన లైఫ్ జాకెట్లను తీసేశారు. లాంచి బయలుదేరేటపుడు ఇచ్చిన లైఫ్ జాకెట్లను అందరూ వేసుకున్నవారే. సరిగ్గా ప్రమాదం జరిగే ముందే చాలామంది లైఫ్ జాకెట్లను తీసేశారు.

 

డ్యాన్సులను ఎంజాయ్ చేస్తున్న పర్యాటకుల్లో  నలుగురు స్నేహితులు కూడా ఉన్నారు. ఈ నలుగురిలో లైఫ్ జాకెట్లు ఎవరు వేసుకున్నారు ? తీసేసిందెవరు ? అన్నది తేలకపోయినా ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడింది మాత్రం మండల గంగాధర్ ఒక్కడే. ముణిగిపోయేముందు నలుగురు స్నేహితుల్లో ముగ్గురు లాంచి అంచున నిలబడి ఉన్నట్లు సమాచారం.

 

లాంచి పెద్ద కుదుపుకు గురైనపుడు ముందుగా నదిలోకి పడిపోయారు కొందరు. అలాగే రెండోసారి ఒక్కసారిగా ముందుకు దూకినపుడు జరిగిన రెండో కుదుపులో మరికొందరు నదిలోకి ఎగిరిపడ్డారు. ఈ రెండు కుదుపుల్లోను ముగ్గురు మిత్రులు నదిలోకి పడిపోయి గల్లంతయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: