ఆర్టికల్ 370 రద్దు అంశంలో భారత్‌ను అంతర్జాతీయంగా ఇబ్బందిపాలు చేసేందుకు ఎంత ప్రయత్నించినా ప్రపంచ దేశాలు పట్టించుకోకపోవడంతో పాకిస్థాన్ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. ముఖ్యంగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ త‌రుచూ అణుయుద్ధం తప్పదని బీరాలు పలుకుతున్నారు. భారత్‌తో అణు యుద్ధం తప్పదని పాకిస్థాన్  ప్రధాని  మరోసారి హెచ్చరించారు. ఇమ్రాన్‌ఖాన్ అల్‌జజీరా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ కామెంట్లు చేశారు.


భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఇమ్రాన్.. సంప్రదాయ యుద్ధంలో తాము గెలిచే పరిస్థితి లేకపోతే అణ్వాయుధాలు వినియోగించక తప్పదని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం చర్యలు తమకు ఆగ్రహం కలిగించాయని, ఇకపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భారత్‌తో యుద్ధం సంభవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న రెండు దేశాల మధ్య సంప్రదాయ యుద్ధం మొదలైనప్పుడు.. చివరికి అది అణుయుద్ధంతో ముగుస్తుందన్నారు. ``భారత్‌తో సంభవించే సంప్రదాయ యుద్ధంలో మేము ఓడిపోతున్నామనుకోండి.. లొంగిపోవాలా? లేదా తుదిశ్వాస విడిచేవరకు పోరాడాలా? అన్న సందిగ్ధత ఎదురవుతుంది. అప్పుడు పాకిస్థానీలు కచ్చితంగా స్వేచ్ఛ కోసం చచ్చేదాకా పోరాడాలనే నిర్ణయించుకుంటారు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఒక దేశం చివరివరకు పోరాడితే ఫలితం ఊహకందని స్థాయిలో ఉంటుంది. ఆ విపత్తు ప్రభావం భారత ఉపఖండాన్ని దాటి విస్తరిస్తుంది.`` అని హెచ్చ‌రించారు. 


కాగా, ఇమ్రాన్ ఓవైపు అణు యుద్ధ వ్యాఖ్యలు చేస్తూనే మరోవైపు తనను తాను శాంతికాముకుడిగా అభివర్ణించుకున్నారు. తాను యుద్ధానికి వ్యతిరేకమని చెప్పారు. పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని మొదలుపెట్టదని, ఏ సమస్యకూ యుద్ధం పరిష్కారం కాదని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో శాంతిని కొనసాగించేందుకే తాము సమస్యను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తాము శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుంటే భారత ప్రభుత్వం తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. నాగరికత కలిగిన పొరుగుదేశంగా మేము మా మధ్య (కశ్మీర్ అంశంపై) ఉన్న సమస్యలను రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాం. కానీ నరేంద్రమోదీ ప్రభుత్వం మమ్మల్ని ఆర్థికంగా దివాళా తీయించాలని ప్రయత్నిస్తున్నది. పాకిస్థాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించాలని చూసింది. అంటే మాపై ఆర్థికంగా ఆంక్షలు విధించేలా భారత్ పావులు కదుపుతున్నది అని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: