-నేడు ప్రపంచ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవం

అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై నివసించే సకల జీవకోటికి రక్షణ కవచంగా నిలుస్తోంది ఓజోన్‌ పొర. అయితే ప్రాణకోటికి ప్రకృతి అందించిన వరంగా చెప్పవచ్చు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఓజోన్‌ పొర క్షీణిస్తోందని పర్యావరణ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భవిష్యత్తులో జీవకోటికి తలెత్తే ప్రమాదాన్ని గమనించిన ఐక్యరాజ్యసమితి, ఓజోన్‌ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలను ఏకం చేసింది. సెప్టెంబర్‌ 16న ప్రపంచ ఓజోన్‌ పరిరక్షణ దినంగా ప్రకటించింది.

సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడటం వల్ల సకల జీవరాసులకూ ముప్పు వాటిల్లుతోంది. ఆ వేడిని తట్టుకునే సామర్థ్యం భూమిపై నివసించే జీవరాసులకు లేదనే చెప్పుకోవాలి. మనుషులు సైతం తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.  భూమిపైన 15 నుంచి 25 కిలోమీటర్ల వరకూ ఉండే రెండో పొరను ఓజోన్‌ పొర అంటారు. ఈ పొర సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమిమీదకు చేరకుండా అందులో ఉండే అతినీలలోహిత కిరణాలను గ్రరహిస్తుంది. తద్వారా ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతోంది ఓజోన్‌ పొర. 

 

మనిషి తన అవసరాలకు చేస్తున్న పొరపాట్ల వల్ల ప్రకృతి ప్రమాదం బారిన పడుతోంది. సాంకేతిక పరంగా కొత్త పుంతలు తొక్కడంతో ప్రమాద స్థాయి పెచ్చురిల్లుతోంది. పల్లెల నుంచి చాలా మంది పట్టణాలకు వలసబాట పట్టడంతో కాలుష్యం పెరిగిపోతోంది. ఇబ్బడిముబ్బడిగా మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం ఓజోన్‌ పొరకు చేటు తెస్తోందని శాస్త్రవేత్తలు మొరపెట్టుకుంటున్నా….అవేవీ పట్టనట్టు వ్యవహరించడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. మానవ తప్పిదాల వల్ల పుడమికి రక్షణ కవచంలా ఉండే ఓజోన్‌ పొర నేడు పలుచబడిపోతోంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్‌ పొర దెబ్బతింటూ ఉండటంతో మానవులు రోగాల బారిన పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: