నిన్న తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో దాదాపు 37 మంది గల్లంతయ్యారు. వీరిలో విశాఖ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన 12 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. విశాఖలోని రామలక్ష్మి కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబ సభ్యుల్లో ఒక్కరు మినహా 12 మంది గల్లంతయ్యారు. కారు డ్రైవింగ్, కాటరింగ్ ద్వారా జీవనం సాగిస్తున్న రమణబాబు కుటుంబం ఆదివారం రోజు రాత్రి రైల్లో రాజమహేంద్రవరం (రాజమండ్రి) వెళ్లారు. అక్కడి నుండి భద్రాచలం వెళ్లటానికి బోటులో ఎక్కారు. 
 
బోటు ప్రమాదంలో 12 మంది గల్లంతవగా బోశాల లక్ష్మిని మాత్రం సిబ్బంది రక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఐదుగురు స్నేహితులు పాపి కొండల యాత్ర కొరకు వెళ్లగా ముగ్గురు ప్రమాదం నుండి క్షేమంగా బయటపడగా ఇద్దరు మరణించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు స్నేహితులలో ఒకరు క్షేమంగా బయటపడగా ఒకరు మృతి చెందారు. నర్సాపురంకు చెందిన ధనుష్ అనే వ్యక్తికి గోదావరి అంటే ఎంతో అభిమానం. 
 
గోదావరి నదిలో కాలుష్యాన్ని కట్టడి చేద్దామంటూ చాలాసార్లు ప్రదర్శనలు కూడా చేశాడు. ధనుష్ తో పాటు ముగ్గురు స్నేహితులు వెళ్లగా ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. వరంగల్ కు చెందిన 14 మంది బోటులో ప్రయాణం చేయగా 9 మంది గల్లంతయ్యారు. హైదరాబాద్ నుండి 22 మంది ఈ బోటులో ప్రయాణం చేసినట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
 
ప్రమాదం జరిగిన సమయంలో భోజనం ఏర్పాట్లు జరుగుతూ ఉండటంతో ఎక్కువ మంది లైఫ్ జాకెట్లు వేసుకోలేదని తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన జానకిరామయ్య శవాసనం వేసి ప్రాణాలను కాపాడుకున్నాడు. కానీ అతని కుటుంబ సభ్యుల వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. బోటులో ప్రాణాలతో బయటపడిన వారు రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: