పాపికొండలు చాలా అందమైనవి. పర్యాటకులు చూడాలనుకునేవి. కొండలను చూస్తూ నదిలో షికార్ చేయడం అందమైన అనుభూతి. అటువంటి పాపికొండలపై  ఉన్న మోజు అంతా ఇంతా కాదు, సినిమాల్లో ఎన్నో సార్లు హీరోయిన్ని మించిన అందాన్ని, గ్లామర్ ని ఇచ్చిన చరిత్ర పాపికొండలకు ఉంది. రా రమ్మని అవి పిలిస్తే ప్రక్రుతి ప్రేమికుడు ఎవడూ ఆగలేడుగా..


పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే పాపికొండలు ఇక కనబడవు, , కనుమరుగు అవుతాయి. ఇదే ఇపుడు పర్యాటకుల్లో టెన్షన్ పెడుతోంది. నిజమే ప్రాజెక్ట్ అయితే కొండలు జలసమాధి అవుతాయి. అందువల్ల వాటి అందాలను ఈ లోగానే చూసేయాలన్న తపన, ఆరాటమే పర్యాటకుల పాలిట మ్రుత్యుఘంటికలు మోగిస్తోందని అంటున్నారు.తాజాగా దేవీపట్నం వద్ద  జరిగిన రాయల్ వశిష్ట బోటు ప్రమాదం కూడా పాపికొండల మోజుతోనేనని అంటున్నారు. ఈ మోజుని క్యాష్ చేసుకుంటున్న ట్రావెలర్స్ ప్రాణాలకు పెద్దగా విలువ ఇవ్వడంలేదు, రక్షణ పరమైన చర్యలు కూడా ఏమీ తీసుకోవడంలేదు. చాలా పడవల్లో లైఫ్ జాకెట్లు సరఫరా లేదు, సేఫ్టీ మెజర్స్ అంతకంటే లేవు.


అయినా సరే అటూ ఇటూ అఖండ గోదావరిని ఈదుకుంటూ బోట్లు షికార్ చేస్తున్నాయి. అద్రుష్టం బాగుంటే బయటపడుతున్నారు. లేకపోతే జల సమాధి అవుతున్నారు. తాజా సంఘటనలో అదే జరిగింది. కనీసం పర్మిషన్ కూడా లేకుండా గోదావరి వరద పోటెత్తిన వేళ టూరిస్టులను తీసుకుని బోట్లు ఎలా వెళ్తాయి. ఇది కచ్చితంగా అందరిలోనూ వచ్చిన ప్రశ్న. దీనికి సమాధానం  మాత్రం ఉండదు, ఎపుడూ చెప్పలేరు కూడా. ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన అధికారులే చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. అమాయక పర్యాటకులకు ప్రక్రుతి అందాలు చూడాలన్న ఆత్రుత తప్ప మరేమీ కనిపించదు. దాంతో సరదాగా వెళ్ళి ప్రాణాలను కొల్పోతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి విహార విషాదాలకు అడ్డుకట్ట వేయాలని అంతా కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: