తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ బోటులో ప్రయాణం చేసిన వారిలో మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంఘటనా స్థలాన్ని సందర్శించాలని నిర్ణయించుకుకున్నారు. కాసేపట్లో సీఎం రాజమండ్రికి చేరుకోనున్నారు. అధికారులతో కలిసి బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. 
 
ఆ తరువాత ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను సీఎం జగన్ పరామర్శించనున్నారని తెలుస్తుంది. ఈ ఘటనలో 39 మంది గల్లంతు కాగా 8 మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. ఈ 8 మృతదేహాలు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి రాకతో అధికారులు అందరూ అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని అధికారులకు, నాయకులకు సీఎం ఆదేశాలు ఇచ్చారని సమాచారం. 
 
ప్రస్తుతం మరో 4 మృతదేహాలు లభ్యమయినట్లు సమాచారం. ఈ 4 మృతదేహాలను కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నారు. ఎనిమిది బృందాలు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. గోదావరిలో నీటి ఉధృతి వేగంగా ఉండటంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం కలుగుతుందని తెలుస్తోంది. అధికారులు బోటు యాజమాన్యాల నిర్లక్ష్యం వలన ఇలాంటి ఘటనలు జరిగినట్లు చెబుతున్నారు. 
 
బోటు యాజమాన్యం ప్రస్తుతం అఙాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. బోటు యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న సమాచారం ప్రకారం బోటులోని సిబ్బంది నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వరంగల్, హైదరాబాద్ కు చెందిన వారు ఎక్కువమంది బోటులో ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గోదావరి నది చరిత్రలో ఇది రెండవ అతి పెద్ద ప్రమాదం అని సమాచారం.




మరింత సమాచారం తెలుసుకోండి: