జలమే జీవనం.. జలమే జీవనాధారం.. జలమే సర్వస్వం.. అలాంటి జలకళ కానరాక ఆంధ్రప్రదేశ్ నిన్న మొన్నటి వరకూ ఘోషపడింది. కానీ ఇప్పుడు ఎటు చూసినా జలకళ ఉట్టిపడుతోంది. జోరుగా వర్షాలు.. నిండుగా నిండిన ప్రాజెక్టులు.. పరవళ్లు తొక్కుతున్న గోదావరి, కృష్ణానదులు..ఇదీ ఇప్పుడు ఏపీలో కనువిందు చేస్తున్న దృశ్యం.


కరువు సీమగా ఖ్యాతి పొందిన రాయలసీమలోనూ ఇప్పుడు జలకళ కనిపిస్తోంది. ఓ పక్క పుష్కలంగా వర్షపాతం, మరో పక్క ఎగువ రాష్ట్రాల నుంచి పోటెత్తిన వరద. గత దశాబ్ద కాలంగా లేనివిధంగా మూడు సార్లు శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణా బ్యారేజీలకు రెండు సార్లు పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తేంతగా జలసిరులు రాష్ట్రాన్ని కళకళలాడించాయి.


శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు దాదాపు నెల కిందటే నిండినా ఇప్పటికీ రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులు 50శాతం కూడా నిండలేదు. కాలవల సామర్థ్యం పెంచకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పోతిరెడ్డిపాడు నుండి బానకచెర్లకు 44,000 వరదనీరు పారిస్తే కాలువ పక్కన ఉన్న పొలాలు మునిగిపోతున్నాయి. వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్, SR1, సోమశిల, కండలేరు, SRBC, గాలేరు నగరి, గోరకల్లు, అవుకు, గండికోట, జీడిపల్లి, గొల్లపల్లి జలాశయాలు నిల్వ సామర్థ్యం కంటే తక్కువ టీఎంసీలను కలిగి ఉన్నాయి.


ఇందుకు కారణం కాల్వల సామర్థ్యం సరిగ్గా లేకపోవడమే అన్న విషయాన్ని తన సమీక్షల ద్వారా గుర్తించారు సీఎం వైయస్ జగన్. ఇకపై వరద నీటిని వృధాగా సముద్రం పాలు చేయకూడదని, కాల్వల సామర్థ్యం పెంచడం, కొత్త ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం ద్వారా వరదనీటిని వడిసిపట్టి రాయలసీమ రైతుల సాగునీటి కష్టాలను పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44,000 నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచేలా అధికారులను ఆదేశించారు.


వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్ కాలువ లైనింగ్ సమస్యలు తీర్చనున్నారు. 2008లో వైయస్సార్ శంకుస్థాపన చేసి 407 కోట్లు నిధులు విడుదల చేసిన జలదరాశి, రాజోలి జలాశయాల పనులు పూర్తయితే నంద్యాల, పాణ్యం, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో సాగు సమస్యలు తీరిపోయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: