ఉగ్రవాదం, హింసను తక్షణం నిలిపివేయాలని లేనిపక్షంలో పాకిస్థాన్ విభజనను ఏ శక్తీ అడ్డుకోలేదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరించారు. పాకిస్థాన్‌లో మైనార్టీ ప్రజలంతా అభద్రతతో బతుకుతున్నారని, సింధీలు, సిక్కులపై దాడులు, బలూచిస్థాన్‌లో వారి ఆగడాల గురించి ప్రపంచం మొత్తానికీ తెలుసన్నారు. పాక్ నుంచి ఎవరైనా అక్రమంగా సరిహద్దు దాటి ప్రవేశిస్తే భారత బలగాలు వారిని ప్రాణాలతో విడిచిపెట్టవని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం ఉన్నదని, అయినా పాక్ ఐరాసను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి విఫలమైందన్నారు. ఇటీవల సూరత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ  ఆయన పాకిస్థాన్ తీరును ఎండగట్టారు. ఇంకా అలాంటి విధానాలే కొనసాగితే పాక్ మళ్లీ ముక్కలు కావడాన్ని ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదు అని పేర్కొన్నారు.



పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, సరిహద్దులో హింసకు పాల్పడటాన్ని నిలిపివేయకుంటే ఆ దేశం ముక్కలవడం ఖాయమని హెచ్చరించారు. ఈ మేరకు రాజ్‌నాథ్ ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. ఇమ్రాన్‌ఖాన్ మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఐరాసలో మానవ హక్కుల గురించి ప్రస్తావించే ముందు ఆయన తన దేశంపై దృష్టిపెట్టాలని సూచించారు. ముఖ్యంగా భారత్‌తో అణుయుద్ధం తప్పదన్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కి సూటిగా సమాధానం చెప్పారు. మన పొరుగుదేశం ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని వెంటనే నిలిపివేయాలి.




వారి విధానాలు మారకుంటే ఏదో ఒకరోజు ఆ దేశం ముక్కలవడాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదు అని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దును ఇమ్రాన్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితిని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. పాక్ వెంటనే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆపేయాలి. మత రాజకీయాల కోసం బ్రిటిష్ పాలకులు భారత్‌ను రెండు దేశాలుగా విభజించారు. పాకిస్థాన్ ప్రభుత్వ పాలసీల వల్ల 1971 యుద్ధం తర్వాత ఆ దేశం మళ్లీ రెండుగా విడిపోయింది. భిన్నమతాలకు చెందిన ప్రజలంతా శాంతియుతంగా, ఐకమత్యంతో భారత్‌లో జీవిస్తున్నారు. ఇది పాకిస్థాన్‌కు కంటగింపుగా మారింది. భారత్‌లో మైనార్టీలు సురక్షితంగా ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు అని మరో ట్వీట్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: