ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల కొరకు 21 లక్షల 69 వేల ధరఖాస్తులు రాగా 19 లక్షల 74 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు. మరికొన్ని రోజుల్లో ఈ పరీక్షల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. 
 
ఈ సమయంలో ప్రభుత్వం పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ లో విడుదలైన ఉద్యోగాలకు తగినంత మంది అభ్యర్థులు ఎంపిక కాని పక్షంలో అర్హత మార్కులను తగ్గిస్తామని వెల్లడించింది. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు శుభవార్త అని చెప్పవచ్చు. 
 
వచ్చే నెల 2వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో అమలులోకి వస్తుంది. పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం 1902 కాల్ సెంటర్ నెంబర్ ఏర్పాటు చేసింది. ఈ నెంబర్ కు కాల్ చేయటం ద్వారా పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే పరిష్కారం లభిస్తుంది. 14,944 గ్రామ, వార్డ్ సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. 
 
ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాల కోసం మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో భారీ సంఖ్యలో గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేయగా కొన్ని ప్రాంతాలలో అభ్యర్థుల కొరత కారణంగా ఎంపిక జరగలేదు. కొంతమంది ఎంపికైన తరువాత విధుల్లో చేరలేదు. అందువలన మరోసారి గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: