మాజీ మంత్రి కోడెల శివ ప్రసాద రావు 2 మే, 1947 న గుంటూరు జిల్లా కండ్లగుంట లో జన్మించారు. ఇక ఆయన బాల్యం మరియు చదువు గుంటూరు జిల్లా సిరిపురం సాగింది. అనంతరం ఆయన తన ప్రీ యూనివర్సిటీ విద్యను విజయవాడలో పూర్తి చేసారు. చిన్నతనంలోనే తన కుటుంబంలోని కొందరు అనారోగ్యం బారిన పడి, సరైన చికిత్సకు అందక చనిపోవడంతో, కోడెల డాక్టర్ కావాలనున్నారు. మరింత గట్టి పట్టుదలతో, ఆ తరువాత ఎంబిబిఎస్ విద్యను గుంటూరు మెడికల్ కాలేజీలో, అలానే ఎమ్ఎస్ విద్యను బనారస్ హిందూ యూనివర్సిటీ ద్వారా పూర్తి చేసారు. అనంతరం నరసరావుపేటలో ఆసుపత్రి కట్టించి, పేదలకు అక్కడే వైద్యం అందించడం మొదలెట్టారు. 

ఆయన సతీమణి పేరు శశికళ, కోడెలకు మొత్తం ముగ్గురు సంతానం, కాగా అందులో ఒక కుమారుడు మరణించారు. వారి కుమారుడు మరియు కుమార్తె కూడా డాక్టర్లే కావడం విశేషం. అయితే అప్పటికే పల్నాడు ప్రాంతంలో కాంగ్రెస్ రాజ్యమేలుతుండగా, వారికి గట్టిగా చెక్ పెట్టడంలో కోడెల వంటి వారే అవసరం అని భావించి, అప్పట్లో ఆంధ్రుల అన్నగారు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు స్థాపించిన టిడిపి పార్టీ ద్వారా కోడెల రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. మొదట కొంత అయిష్టతతో రాజకీయాల్లో చేరిన కోడెల, తొలిసారి గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నుండి 1983లో విజయం సాధించి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కూడా పలుమార్లు అదే నియోజకవర్గం నుండి నిలబడి విజయఢంకా మ్రోగించిన కోడెల గారు, ఎన్టీఆర్ మరియు చంద్రబాబు గారి హయాంలో క్యాబినెట్
మినిస్టర్ గా పనిచేయడం జరిగింది. హోమ్, ఆరోగ్య, భారీ నీటిపారుదల, పంచాయితీరాజ్, మంత్రిగా పలు శాఖల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశేషంగా సేవలు అందించారు కోడెల. 

ఇక మొదటినుండి మంచి రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన కోడెల, ఇటీవల 2014 ఎన్నికల తరువాత సత్తెనపల్లి నుండి ఎమ్యెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ శాసన సభకు స్పీకర్ గా పనిచేయడం జరిగింది. అయితే మొన్నటి 2019 ఎన్నికల సమయంలో కూడా అదే నియోజకవర్గం నుండి పోటీ చేసిన కోడెల, తన ప్రత్యర్థి మరియు వైసిపి ఎమ్యెల్యే అంబటి రాంబాబు చేతిలో పరాజయం పాలయ్యారు. మొదటినుండి పార్టీకి అలానే పల్నాడు ప్రాంత ప్రజలలకు ఎంతో వెన్నుదన్నుగా ఉన్న కోడెలను పల్నాటి పులి అని పిలిచేవారు. అయితే ఇటీవల సచివాలయ ఫర్నిచర్ విషయమై ఆయనపై నిందారోపణలు జరుగడంతో, తీవ్ర మనస్థాపానికి గురైన కోడెల, అవి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: