తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ఒక అధ్యాయం ముగిసింది. త‌న‌దైన శైలిలో దూకుడు, త‌న‌దైన శైలిలో విచ‌క్ష‌ణను రంగ‌రించి రాజ‌కీయాలు చేసిన గుంటూరు వాసి, అన్న‌గారికి ఎన్టీఆర్ గారికి అత్యంత ప్రియ‌నేత కోడెల శివ‌ప్ర‌సాద‌రావు .. అర్ధాంత‌రంగా త‌నువు చాలించారు. త‌న నివాసంలోనే ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌నే కాకుండా.. టీడీపీ పార్టీని, అనుచ‌రుల‌ను, నాయ‌కుల‌ను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. 1982 వ‌ర‌కు ఆయ‌న ఓ సాధార‌ణ వైద్యుడు. న‌ర‌స‌రావు పేట‌లో డిస్పెన్స‌రీని ప్రారంభించి పేద‌ల‌కు వైద్యం అందించే అప‌ర వైద్య నారాయ‌ణుడిగా పేరు తెచ్చుకున్నారు.


ఆ స‌మ‌యంలోనే అన్న‌గారు ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో రాజ‌కీయాల‌ను ప్రారంభించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న విద్యావంతులు, మేధావులు, యువ‌త‌ను త‌న పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేప‌థ్యంలోనే ఈనాడు అధినేత రామోజీరావు సిఫార‌సుల మేర‌కు కోడెల టీడీపీ తీర్థం పుచ్చుకున్నార‌ని చెబుతారు. ఇదే విష‌యాన్ని కోడెల కూడా ఓ సంద‌ర్భంలో ద్రువీక‌రించారు. కాగా, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ఒడిదుడుకులు వ‌చ్చినా కూడా కోడెల త‌ను న‌మ్మిన పార్టీని, త‌న‌ను ఆద‌రించి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన పార్టీని ఏ నాడూ విడిచి పెట్ట‌లేదు.


ఇక‌, పార్టీలో వ‌రుస‌గా ఐదు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి రికార్డు సృష్టించారు. అంద‌రికీ త‌లలో నాలుక‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు.. చిన్న పెద్ద అంద‌రినీ గౌర‌వించే నాయ‌కుడిగా కూడా కోడెల గుర్తింపు పొందారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో విరుచుకుప‌డేవారు. అదే పార్టీ అధికారంలోకి రాగానే ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎన‌లేని కృషి చేశారు. స్వ‌చ్ఛ న‌ర‌స‌ర‌రావుపేటగా కేంద్రం నుంచి అవార్డు అందుకుందంటే దీనికి కోడెల చేసిన కృషి ఎంతో ఉంది. అంతేకాదు, ఆయ‌న మ‌హిళా ప‌క్ష‌పాతి. మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో 33శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నే విష‌యంలో ఏపీనుంచి తీర్మానం పంపిన‌ప్పుడు అసెంబ్లీలో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకుని బిల్లు పాస‌య్యేలా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇలా కోడెల ప్ర‌స్థానం అపూర్వం.. అద్వితీయం.



మరింత సమాచారం తెలుసుకోండి: