ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతి చెందారు. 1947 సంవత్సరం మే నెల 2 వ తేదీన కోడెల శివ ప్రసాద రావు లక్ష్మీ నర్సమ్మ, సంజీవయ్య దంపతులకు జన్మించారు. కోడెల శివ ప్రసాద్ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. కోడెల ఐదవ తరగతి వరకు సొంత గ్రామమైన కండ్లగుంటలోనే చదివారు. ఆ తరువాత సిరిపురంలోను, నర్సారావుపేటలోను చదివి పదవ తరగతి పూర్తి చేశారు. 
 
విజయవాడలోని లయోలా కాలేజీలో పీయూసీ చదివిన కోడెల ఆ తరువాత కర్నూలు వైద్య కళాశాలలో చేరారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన గుంటూరులో కోడెల ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎంబీబీఎస్ పూర్తయిన తరువాత నరసరావుపేటలో ఆసుపత్రిని నెలకొల్పటమే కాకుండా వైద్య వృత్తిని చేపట్టి తక్కువ సమయంలోనే కోడెల మంచి పేరును తెచ్చుకున్నారు. గుంటూరులో కోడెల అభిమానులు కోడెలను పల్నాటి పులి అని పిలుస్తారు. 
 
సీనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించటంతో రాజకీయాలంటే ఇష్టం లేకపోయినా రాజకీయాల్లో చేరి 1983 లో ఎమ్మెల్యేగా నరసరావుపేట నియోజకవర్గం నుండి కోడెల విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా కోడెల వైద్య సేవలు అందించారు. కోడెలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కోడెల ముగ్గురు పిల్లలు వైద్య వృత్తిలోనే కొనసాగుతున్నారు. 
 
కోడెల శివ ప్రసాద్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 1985, 1989, 1994, 2004 సంవత్సరాల్లో కోడెల నరసరావుపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 సంవత్సరంలో సత్తెనపల్లి నుండి గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. కోడెల శివ ప్రసాద రావు హోం మంత్రిగా, నీటి పారుదల మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. 2014 - 2019 వరకు కోడెల ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: