ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ చరిత గల మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌ రావు నేడు కన్నుమూశారు. 1947 మే 2న గుంటూరు జిల్లా నకరికల్ మండలం కండ్లగుంట గ్రామంలో సంజీవయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు కోడెల జన్మించారు. విజయవాడ లయోలా కళాశాలలో పియూసీ చదివారు. బాల్యంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో మరణించడంతో.. డాక్టర్ కావాలని నిర్ణయించుకున్న ఆయన తాత ప్రోత్సాహంతో మెడిసిన్ చదవారు. మెడిసిన్  చదువుకున్న కోడెల శివప్రసాదరావు.. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

1947 మే2న కండ్లగుంటలో జన్మించిన ఆయన.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో నర్సరావుపేట నుంచి కోడెల తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నర్సరావుపేట అంటే కోడెల అనేలా ఆయన 1983,85,89,94,99 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుసగా గెలిచారు.  ఎన్టీఆర్ కేబినెట్‌తో పాటు చంద్రబాబు కేబినెట్‌లో కూడా కోడెల మంత్రిగా వ్యవహరించారు. 2014-19 వరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు.ఇక 2004,2009 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి పోటీ చేసి కోడెల ఓడిపోగా.. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిచారు. 

ఇటీవల ఆయనపై వరుసగా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.  తన చుట్టూ చిక్కుకున్న కేసులు, గృహ సంబంధ గొడవలు ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ నేపథ్యంలో ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, సినీ దర్శకుడు రాఘవేందర్‌ రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ రెవంత్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, తెలంగాణ మంత్రులు తలసాని, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నిరంజన్‌ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: