తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. పూర్వ వైభ‌వం తెచ్చుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా తెలంగాణ గెలిచి తీరాల‌న్న‌క‌సితో క‌మ‌ల‌ద‌ళం దూసుకొస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టి కాంగ్రెస్‌, టీడీపీల‌తోపాటు అధికార టీఆర్ఎస్ నుంచి కీల‌క నేత‌ల‌ను లాగే ప‌నిలో బీజేపీ నిమ‌గ్న‌మైంది. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక తాజా విష‌యానికి వ‌స్తే.. నిజానికి చాలా రోజులుగా వినిపిస్తున్న మాటే ఇది. తెలంగాణ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొంది.. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొండా సురేఖ కూడా క‌మ‌లం పార్టీలో చేరుతార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.


ఈనెల 17న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా హైద‌రాబాద్‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో కొండా దంప‌తులు ఆ పార్టీలో చేరుతార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం కొండా సురేఖ‌, కొండా ముర‌ళి కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కొండా దంప‌తులు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విష‌యం తెలిసిందే. అయితే.. ప‌ర‌కాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన కొండా సురేఖ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక అప్ప‌టి నుంచి కొండా దంప‌తులు సైలెంట్‌గానే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.


దీంతో కొండా దంప‌తులు రాజ‌కీయంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. నిజానికి.. తెలంగాణ‌లో వ‌చ్చిన ముందస్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంద‌న్న ధీమాతోనే వారు టీఆర్ఎస్‌ను వీడారు. కానీ.. ఫ‌లితాలు ప్ర‌తికూలంగా రావ‌డంతో కొండా దంప‌తులు అయోమ‌యంలో ప‌డిపోయారు. ఒకానొక ద‌శ‌లో రాజ‌కీయాల‌ను శాసించిన కొండా దంప‌తులు ఇప్పుడు అదే రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీ కొంత హ‌డావుడి చేస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత అదే పాజిటివ్ వేవ్‌ను మ‌రింత వేగంగా తీసుకొస్తోంది.


ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌, టీడీపీల‌తోపాటు అధికార టీఆర్ఎస్ నుంచి ప‌లువురు కీల‌క నేత‌లు క‌మ‌లం గూటికి చేరారు. తాజాగా.. అమిత్‌షా స‌మ‌యంలో కొండా దంప‌తులు కూడా బీజేపీలో చేరుతార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. కొండా దంప‌తుల చేరిక‌తో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో బీజేపీ కూడా మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం తాము బీజేపీలో చేర‌డ‌మే క‌రెక్టు అనే యోచ‌న‌లో కొండా దంప‌తులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!



మరింత సమాచారం తెలుసుకోండి: