కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌ షా ఇటీవల భాషపై చేసిన ప్రకటన.. ఒకే దేశం ఒకే భాష అనే నినాదంపై తమిళులు రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు తలొగ్గేది లేదనీ డీఎంకే అధినేత ఎం. కే. స్టాలిన్‌ అన్నారు.  ఈ సందర్భంగా డీఎంకే పార్టీ హై లెవెల్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని స్టాలిన్‌ మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆధిపత్య నిర్ణయాలను ఎప్పటికీ స్వాగతించబోము. కేంద్రానికి వ్యతిరేకంగా డీఎంకే ఆధ్వర్యంలో ఈ నెల 20న 10 గంటలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల హెడ్‌ క్వార్టర్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నామనీ, హిందీ భాషను తమిళనాడులో బలవంతంగా చొప్పిస్తామంటే ఊరుకునేది లేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


ఢిల్లీలో నిర్వహించిన హిందీ దివస్‌ సమారోహ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ....దేశమంతటికీ ఉమ్మడి భాషగా హిందీ ఉండాలని, అది మాత్రమే దేశం మొత్తాన్ని ఐక్యం చేయగలదని పేర్కొన్నారు. దేశమంతటా హిందీ భాష ఉండాలన్నది మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కల అని, దానిని సాకారం చేయాలని కోరారు. దేశమంతటికీ ఒకే ఉమ్మడి భాష ఉంటే, అది భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిస్తుందని తెలిపారు. హిందీ దివస్‌ సందర్భంగా శనివారం ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ హిందీని దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.


అయితే, దీనిపై ఆయా పార్టీలు మండిప‌డ్డాయి. ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ తమిళభాషపై తమకు గల మక్కువను తెలియజేశారు. కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలుగా మేం చెబుతూనే ఉన్నాం. తమిళం మాకు గర్వకారణమని నొక్కి చెబుతున్నా కేంద్రానికి పట్టనట్టుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తమిళ భాషను వదులుకోం. తమిళం అతి పురాతనమైన, గౌరవమైన భాష. మా మాతృ భాషను వదులుకోలేమని మేము ప్రతిజ్ఞ చేశాం. అన్ని భాషలను అంఘీకరించడానికి మేము సిద్దంగా ఉన్నాం. కానీ హిందీనే మొదటి భాషగా ఎంచుకొమ్మని ఒత్తిడి తెస్తే ఊరుకోం` అని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: