మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చనిపోయారు. ఆయన ఉరివేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన మృతదేహాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఏదైనా అనారోగ్యం వస్తే.. ఓ నిమ్సే కో, కేర్ కో.. అపోలో ఆసుపత్రికో తీసుకెళ్తారు. కానీ కోడెలను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు..?


ఇది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. బొత్స వంటి నేతలు కూడా ఇదే అడిగారు. కానీ బసవతారకం ఆసుపత్రితో కోడెల శివప్రసాదరావుకు చాలా అనుబంధం ఉంది. హైదరాబాద్ లోని ఈ బసవ తారకం ఆసుపత్రికి ఆయన చాలా కాలం ట్రస్టు చైర్మన్ గా సేవలందించారు.


కోడెల శివప్రసాదరావు ఎన్టీఆర్ కు దగ్గరి వ్యక్తి కావడం.. అందులోనూ కోడెల శివప్రసాదరావు స్వయంగా వైద్యుడు కావడంతో బసవతారకం ట్రస్టు ఛైర్మన్ గా కోడెల శివప్రసాదరావును ఎన్టీఆర్ కుటుంబం నియమించింది. బసవతారకం ఆసుపత్రి అభివృద్ధికి కోడెల శివప్రసాదరావు చాలా కృషి చేశాడని చెబుతారు. తానే స్వయంగా చాలా కాలం ఛైర్మన్ గా ఉన్న ఆసుపత్రిలోనే కోడెల మృతదేహం ఉంచాల్సి రావడం విషాదమే. అందులోనూ అనుమానాస్పద మృతిగా ఉండటం మరీ దారుణం.


సరే.. కోడెలకు బసవతారకం ఆసుపత్రితో అనుబంధం ఉంది సరే.. కానీ అనుబంధాలకూ.. అత్యవసర చికిత్సకూ సంబంధం ఏంటి.. కోడెల అనారోగ్యంతో స్వయంగా ఆ ఆసుపత్రిలోచేరితే అందులో పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కానీ కోడెల అపస్మారకస్థితిలో ఉన్నప్పుడు ఆసుపత్రికి తెచ్చారని బసవతారకం ఆసుపత్రి బృందం ప్రకటించింది.


అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్తారు. అందులోనూ అపోలో, కేర్ వంటి ఆసుపత్రులు అందుబాటులోనే ఉన్నాయి కూడా. ఇప్పుడు ఇదే అందరిలోనూ అనుమానాలు రేపుతున్న ప్రశ్న. మరి ఈ ప్రశ్నలకు సందేహాలు తీర్చేదెవరు.. ఏదైనా పోలీసు విచారణలో తేలాల్సిందేనేమో. చూద్దాం.. ఏం తేలుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: