ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిన్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కోడెల మృతి గురించి కోడెల కుటుంబ సభ్యులు ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం కోడెల మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం 10 గంటల సమయంలో కోడెల అల్పాహారం తిని మొదటి అంతస్తులో ఉన్న గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నట్లు సమాచారం. 
 
కొంత సమయం తరువాత కూతురు కోడెల గది వద్దకు వెళ్లిన తరువాత కిటికీలో కోడెల ఫ్యాన్ కు ఉరేసుకున్న స్థితిలో కనిపించాడు. డ్రైవర్ ప్రసాద్ 108 నెంబర్ కు ఫోన్ చేయగా వారు కొన్ని వివరాలు అడగటంతో ఫోన్ కట్ చేసి సొంత కారులో కోడెలను బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కోడెలను 11.35 గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకొనిరాగా 12.39 గంటలకు కోడెల తుదిశ్వాస విడిచారు. 
 
కోడెల మృతదేహాన్ని 2.50 గంటల సమయంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కోడెల కూతురు విజయలక్ష్మి తన తండ్రి ధోవతిని చింపి ఉరి వేసుకున్నాడని చెబుతుండగా పోలీసులు మాత్రం కేబుల్ వైరుతో ఉరి వేసుకున్నట్లు గుర్తించామని చెబుతున్నారు. కోడెల గొంతుపై తాడుతో ఉరేసుకున్న ఆనవాళ్లతో పాటు గొంతు కమిలిపోయిన ఆనవాళ్లు ఉన్నాయని సమాచారం. 
 
కోడెలను సమీపంలో ఉన్న ప్రముఖ ఆస్పత్రులకు తరలించకుండా ఎక్కడో ఉన్న క్యాన్సర్ ఆస్పత్రికి ఎందుకు తరలించారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కోడెల బంధువు సాయిబాబు మీడియాతో కోడెలను ఆయన కుమారుడు శివరామ్ తీవ్రంగా వేధించాడని ఆరోపణలు చేశాడు. కోడెల కొడుకు నుండి ప్రాణ హాని ఉందని చెప్పాడని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత కోడెల మృతిపై ఉన్న అనుమానాలకు స్పష్టత రానుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: