ప్రజారాజ్యం స్థాపించిన తరువాత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీ నాయకులను పంచెలు ఊడదీసి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీపై పవన్ కు ఎంతటి వ్యతిరేకత ఉన్నదో అప్పుడే అర్ధం అయ్యింది.  కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల కారణంగానే దేశం తిరోగమనంలో పయనిస్తోందని, తీసుకుంటున్న నిర్ణయాలే ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని గతంలో పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పుకొచ్చారు.  


కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ను నానా మాటలు అన్న సంగతి తెలిసిందే.  జనసేన పార్టీని స్థాపించి 2014 లో తెలుగుదేశం, బీజేపీకి మద్దతు ఇచ్చారు.  ఆ సమయంలో ప్రచారం చేసే సమయంలో కూడా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోశారు.  మొన్నీమధ్య జరిగిన ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీపైనా, వైకాపా పైన, విరుచుకుపడ్డారు.  తల్లిపార్టీ, పిల్లపార్టీగా విమర్శలు చేశారు.  మొన్నీమధ్య వరకు కూడా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకి.  


మరేమయిందో తెలియదు. యురేనియం తవ్వకాల విషయంలో జనసేన ఓ స్టాండ్ ను ప్రకటించింది.  కేంద్రం యురేనియం తవ్వకాలను జరిపితే దానిపై పోరాటం చేస్తామని చెప్పింది.  రాష్ట్రప్రభుత్వాలు నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపేందులు అనుమతులు ఇవ్వరాదని, అలా ఇస్తే చెంచుల తరపున జనసేన పార్టీ పోరాటం చేస్తుందని, తవ్వకాలు ఆపేవరకు అవసరమైతే తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.  అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిసి యురేనియం తవ్వకాల విషయంపై మాట్లాడారు.  


కాంగ్రెస్ పార్టీ కూడా యురేనియం తవ్వకాల విషయంలో పోరాటం చేస్తోందని చెప్పారు. తాజాగా జనసేన పార్టీ యురేనియం తవ్వకాల విషయంలో అఖిలపక్ష సమావేశం రేపుతూ చేసింది.  ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనసమితి, సిపిఐ, సిపిఎం, వివిధ పర్యావరణ వేత్తలు హాజరయ్యారు. ఈ అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, తెలుగుదేశం పార్టీలు హాజరు కాలేదు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారని అనిపిస్తోంది.  కేవలం ఈ యురేనియం తవ్వకాల విషయంలో మాత్రమే కలిసి పనిచేస్తారా లేదంటే.. మిగతా విషయాల్లో కూడా కలిసి పనిచేస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: