ఏపీ శాస‌న‌స‌భ మాజీ స్పీక‌ర్ కోడెల శివప్రసాద్ రావు మృతి ఏపీ రాజకీయాలను ఓ ఊపు ఊపుతోంది. సోమవారం జరిగిన ఈ సంఘటన తర్వాత ఏపీ రాజకీయాల్లో అధికార వైసిపి విపక్ష టిడిపి నేతల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది. అధికార వైసీపీ నేతలు కుమారుడు శివ‌రాం టార్చ‌ర్‌ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తుంటే.... విప‌క్ష‌ టిడిపి నేతలు మాత్రం ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, ఒత్తిళ్లు భరించలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని టిడిపి నేతలు ఆంధ్రప్రదేశ్ అంతటా నిరసనలు హోరెత్తిస్తున్నారు. వైసిపిపై విమర్శలు పెరుగుతుండడంతో వైసిపి నేతలు సైతం మంగళవారం ఘాటుగా స్పందిస్తున్నారు.


వైసిపి మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కోడెల కేసుల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా నిరాకరించారని.... ఇదే విషయాన్ని కోడెల‌ కూడా తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడ్డారని ఆయన చెప్పారు. బాబు తీరుతోనే చివర్లో తీవ్రంగా కలత చెందార‌ని.. కోడెలను బాబు క్రమ క్రమంగా పక్కన పెడుతూ వచ్చారని కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. బాబు మాటలు విని కోడెల జంపింగ్ ఎమ్మెల్యేల‌పై వేటు వేయలేదని కూడా నాని చెప్పారు.


ఇక ప్ర‌భుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కోడెల అంశంపై టీడీపీని టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. టీడీపీలో ఎదురైన అనేక అవమానాలతో కోడెల శివప్రసాదరావు తీవ్ర మనోవేదనకు గురయ్యారని  అన్నారు. గత రెండు నెలలుగా కోడెల అనారోగ్యంతో బాధపడుతున్నా.. చంద్రబాబు కనీసం పరామర్శించలేదని గుర్తుచేశారు. ఛలో ఆత్మకూరుకు కోడెల వస్తానంటే టీడీపీ నేతలు ఆయన్ని ఆడ్డుకున్నారని, వర్గ రామయ్య కూడా ఆయనపై అనేక ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఏదేమైనా కోడెల మృతి చివ‌ర‌కు రాజ‌కీయ యుద్ధంగా మారిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: