రాజేష్ పృథ్వీ ఏడో తరగతి వరకు మాత్రమే చదివాడు. కానీ రాజేష్ చేసిన మోసాలు అన్నీఇన్నీ కావు. ఏడో తరగతి చదివిన రాజేష్ నకిలీ డిగ్రీలు సంపాదించాడు. ప్రేమ పేరుతో యువతులకు మాయమాటలు చెప్పేవాడు. ఆ తరువాత యువతులపై అత్యాచారం చేసేవాడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో మోసాలు చేసేవాడు. రాజేష్ ఇప్పటికే ఆరుగురు యువతుల్ని పెళ్లాడి మోసం చేశాడు. 
 
20 మంది యువతులకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. చెన్నైకు చెందిన ఒక యువతి కిడ్నాప్ కు గురైంది. యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించటంతో రాజేష్ కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకొని తిరుప్పూరు అనే ప్రాంతంలో దాచిపెట్టాడని తెలిసింది. పోలీసులు రాజేష్ ను విచారించటంతో అతని చరిత్ర అంతా బయటికొచ్చింది. విచారణలో యువతికి ఎస్సై ఉద్యోగానికి రాజీనామా చేసి కాల్ సెంటర్ ప్రారంభించిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడని తెలిసింది. 
 
రాజేష్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో వృత్తిలో ఉన్నట్లు చెప్పేవాడు. ఒకచోట డాక్టర్ మరోచోట ఇంజనీర్ ఇంకోచోట ఎంబీఏ పూర్తి చేశానని చెప్పుకుంటూ తిరిగేవాడు. చెన్నై క్రైం విభాగంలో పని చేస్తున్నానని చెప్పి ఆరుగురు యువతుల్ని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఎస్ ఐ ఉద్యోగానికి రాజీనామా చేసానని చెప్పి ఒక నకిలీ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు. ఆ కాల్ సెంటర్లో ఉద్యోగంలో చేరిన ఒక యువతిని పెళ్లికి ఒప్పించాడు. ఆ తరువాత యువతిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. 
 
ఆ యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. రాజేష్ మెడికల్ కాలేజీలలో సీట్లు ఇప్పిస్తానని 30 లక్షలు తీసుకొని కొంతమందిని మోసం చేసినట్లు సమాచారం. పోలీసులకు రాజేష్ దగ్గర్ నకిలీ ఓటర్, ఆధార్ కార్డులు, పోలీసుగా నకిలీ గుర్తింపు కార్డులు, వందకు పైగా సిమ్ కార్డులు, పోలీస్ యూనిఫాం, ఖైదీలకు వేసే బేడీలు లభించినట్లు తెలుస్తోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: