శత్రువుల యుద్ధ ట్యాంక్‌లను ఛేదించే మిస్సైల్స్ తయారు చేయడం వాటిని పరీక్షించి అభివృద్ధి చేయడం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్ ఆర్గనైజేషన్ విధి. ఇందులో భాగంగా అనేక పరిక్షలు నిర్వహిస్తూంటుంది డీఆర్డీవో. తాజాగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) కు చెందిన ఓ డ్రోన్‌ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మంగళవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

 

 

చిత్రదుర్గ సమీపంలో డీఆర్‌డీవో ఓ టెస్ట్‌ రేంజ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. చల్లకెరె ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ పేరుతో మానవరహిత, మానవసహిత ఎయిర్‌క్రాఫ్ట్ ప్రయోగాల కోసం ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ టెస్ట్‌ రేంజ్‌ నుంచి రుస్తుమ్‌ - 2 డ్రోన్‌ టెస్ట్‌ ట్రయల్‌ ను డీఆర్డీవో నిర్వహించింది.  ట్రయల్‌ రన్ విఫలమవడంతో ఆ డ్రోన్‌ జోడిచిల్లెనహళ్లి గ్రామంలోని పంటపొలాల్లో సుమారు 7.50 గంటలకు ఈ డ్రోన్ కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రయల్ రన్ జరుగుతూండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో గ్రామస్థులంతా పెద్ద ఎత్తున ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఏం జరిగిందోనని ఆరా తీశారు. కొందరు ఘటనాస్థలంలో ఫొటోలు, వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ డ్రోన్‌ కూలిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.

 

 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ గుమిగూడిన ప్రజలను పంపించి వేశారు. డ్రోన్‌ కూలిన ప్రాంతానికి డీఆర్‌డీవో అధికారులు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు సేకరించి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. డీఆర్డీవో జరిపిన ఈ పరీక్షల్లో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం.


మరింత సమాచారం తెలుసుకోండి: