కోడెల ఆత్మహత్య మిస్టరీలో కీలకమైన ఆధారం కనబడటం లేదా ? కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు అదే అంటున్నారు. కోడెల పర్సనల్ మొబైల్ ఫోన్ కనబడటం లేదట. సోమవారం ఉదయం కోడెల తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించిన విషయం తెలిసిందే. అయితే సాయంత్రం నుండి మొబైల్ ఫోన్ కనబడటం లేదని పోలీసులు గుర్తించారు.

 

కోడెల వాడుతున్న రెండు ఫోన్లలో పర్సనల్ మొబైల్ ఫోన్ ఇంట్లో ఎక్కడ వెదికినా పోలీసులకు దొరకలేదని సమాచారం. ఒకటి పర్సనల్ మొబైల్ ఫోన్ అంటే రెండోదేమిటో అర్ధం కావటం లేదు. కోడెలకు సంబంధించిన కాల్ డేటా మొత్తం మిస్సింగ్ మొబైల్ లోనే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

మొబైల్ ఫోన్ కనబడటం లేదని తెలిసిన తర్వాత ఇల్లంతా పోలీసులు వెతికారు. కానీ ఎక్కడా దొరకలేదని సమాచారం. ఇదే విషయమై ఇంట్లో కూతురు విజయలక్ష్మి, పనివాళ్ళు, గన్ మెన్లు ఎవరినడిగినా తెలియటం లేదనే చెబుతున్నారు. దాంతో పోలీసులకు అందరిపైనా అనుమానాలు మొదలయ్యాయి. కోడెల ఇంట్లోని పర్సనల్ మొబైల్ బయటవాళ్ళు తీసుకెళ్ళే అవకాశాలు దాదాపు లేదనే చెప్పాలి. మొబైల్ ఫోన్ ను మాయం చేయాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు.

 

మరి బయటవాళ్ళు ఎవరూ తీసుకోక, ఇంట్లో వాళ్ళకి మాయం చేయాల్సిన అవసరం లేకపోతే మరి మొబైల్ ఏమైనట్లు ? ఇపుడిదే పోలీసు అధికారులను వేధిస్తోంది. కోడెల బెడ్ రూమ్ లోకి స్వేచ్చగా వెళ్ళ గలిగే అవకాశం కుటుంబ సభ్యులకు, పనివాళ్ళకు మాత్రమే ఉంటుందనటంలో సందేహం లేదు. నిజానికి పనివాళ్ళకు కోడెల మొబైల్ తో పనే ఉండదు. కాబట్టి మిగిలింది కూతురు మాత్రమే అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

కోడెల మొబైల్ కాల్ డేటాను పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయని ఇటు మంత్రులు, వైసిపి నేతలతో పాటు అటు దర్యాప్తు అధికారులు కూడా భావిస్తున్న నేపధ్యంలోనే కోడెల ఫోన్ మిస్సింగ్ అంటే మామూలు విషయం కాదుకదా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: