ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కోడెల మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కోడెల శివ ప్రసాద్ కేసు దర్యాప్తులో కోడెల వ్యక్తిగత మొబైల్ మాయమయినట్లు పోలీసులు గుర్తించారు. కోడెల చనిపోయే ముందు 24 నిమిషాల సమయం పాటు ఎవరితోనో మాట్లాడాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిన్న సాయంత్రం 5 గంటల తరువాత నుండి కోడెల మొబైల్ స్విఛాఫ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
కోడెల శివప్రసాద రావు నిన్న ఉదయం 8.30 గంటలకు 24 నిమిషాల సమయం పాటు ఒకరితో ఫోనులో మాట్లాడారని పోలీసులు గుర్తించారు. ఐతే కోడెల ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు ? ఆ వ్యక్తితో కోడెల ఏం మాట్లాడారు? అనే విషయాలు దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. పోలీసులు కోడెల ఫోన్ నెంబర్ యొక్క ఇన్ కమింగ్ కాల్స్, ఔట్ గోయింగ్ కాల్స్, మెసేజ్ లను పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 
 
పోలీసులు ముఖ్యంగా గడచిన రెండు రోజులుగా కోడెల ఎవరెవరితో ఫోనులో మాట్లాడారు ఎవరి నుండి ఆయనకు కాల్స్ వచ్చాయనే విషయం గురించి దృష్టి సారించినట్లు సమాచారం. పోలీసులు కోడెల ఆత్మహత్యకు గల కారణాలను కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. కోడెల నివాసంలో వేలిముద్రలను క్లూస్ టీం ఇప్పటికే సేకరించింది. కోడెల కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ లిఖితపూర్వకంగా నమోదు చేయటంతో పాటు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
కోడెల వ్యక్తిగత మొబైల్ ఎవరి దగ్గర ఉంది ? కేసులో కీలకంగా వ్యవహరించే ఈ మొబైల్ ఫోన్ ను ఎవరైనా కావాలని దాచేశారా ? 5 గంటల సమయం వరకు ఆఫ్ కాని మొబైల్ ఆ తరువాత ఎందుకు స్విఛాఫ్ అయింది అనే ప్రశ్నలకు ఆ ఫోన్ ఎక్కడుందో తెలిస్తే మాత్రమే సమాధానాలు లభిస్తాయి. పోలీసులు ఇప్పటికే కోడెల ఆత్మహత్యకు పాల్పడిన వైరును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: