మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణంపై టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వమే  మానసిక క్షోభ పెట్టి చనిపోయేలా చేసిందని టీడీపీ ఆరోపిస్తుంటే.. చంద్రబాబే కోడెలకు నమ్మకద్రోహం చేశారని వైసీపీ నేతలు కౌంటరిస్తున్నారు. కోడెల శివప్రసాద రావు మృతిపై సీబీఐ విచారణ జరగాలని రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.


కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు.. వైసీపీ సర్కారే కారణమన్నారు మాజీ సీఎం చంద్రబాబు. తప్పుడు కేసులు పెట్టి.. ఆయన్ను మానసికంగా వేధించారని ఆయన ఆరోపించారు. నేతల్ని రాజకీయంగా టార్గెట్ చేసి.. చచ్చిపోయేలా చేయడం ఏం పద్ధతని ప్రశ్నించారు చంద్రబాబు. కోడెల మృతిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 


కోడెలపై చాలామంది కేసులు పెట్టినా.. ప్రభుత్వం పెట్టిన ఫర్నిచర్ కేసే ఆయన్ను కుంగదీసిందన్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇన్నాళ్లూ గౌరవంగా బతికి, అత్యున్నత పదవులు నిర్వహించిన కోడెలను.. రెండు లక్షల రూపాయల సామాను కోసం బద్నాం చేశారని మండిపడ్డారు డొక్కా. 


కోడెల మరణంతో తమకేం సంబంధమని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ఆయనపై ఎవరో పెట్టిన కేసుల్ని పోలీసులు రిజిస్టర్ చేశారని, ప్రభుత్వం ఒక్క కేసులోనూ ఆయన్ను స్టేషన్ కు పిలిచి వేధించలేదని గుర్తుచేశారు. ఫర్నీచర్ కోడెల ఇంట్లో పెట్టుకోవడం తప్పేనని టీడీపీ నేతలు కూడా చెప్పారన్నారు శ్రీకాంత్ రెడ్డి. 


కోడెల చనిపోవడానికి చంద్రబాబే కారణమన్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. రెండు నెలలుగా ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వేధించారని ఆరోపించారు. కోడెల బతికున్నప్పుడు ఆయన్ను దూరంగా పెట్టి.. ఇప్పుడు శవం పక్కన రాజకీయం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. సీబీఐ ఎంక్వైరీకి తాము కూడా సిద్ధమే అన్నారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలూ సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్న తరుణంలో.. కోడెల మృతి కేసు విచారణ ఎలాంటి మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: