బోటులో పాపికొండల్లో విహారయాత్రకు వెళ్లిన వారు ప్రమాదంలో చిక్కకుని మృత్యువాత పడ్డ కుటుంబీకుల బాధలు వర్ణానాతీతం. అందులో ఓ కుటుంబంలోని భార్యం బతికి బయటపడి, భర్త, కుమార్తె మృతి ఆమె రోదన అందరిని కంటతడి పెట్టిస్తోంది. మూడు నెలల క్రితం మృతి చెందిన సుబ్రమణ్యం తండ్రి ఆస్థికలు గోదావరిలో కలిపేందుకు బయలుదేరిన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఈ కుటుంబమే కాకుండా ఇతర కుటుంబాలు కూడా ప్రాణాలు కోల్పోవడంతో వారి రోదనలతో దద్దరిల్లిపోతోంది. వారిని ఆపడం ఎవరి తరం కావడం లేదు.

 ‘నాన్నంటే ఇష్టం కదా తల్లి. అందుకే ఆయనతో వెళ్లిపోయావా అమ్మా. మరి నాన్నను తీసుకురాలేదే. నేను మీతో పాటే వస్తా నా బంగారు తల్లి'  అంటూ మధులత గుండె పగిలేలా రోదిస్తున్న తీరు ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. ప్రమాదంలో భర్త, కుమార్తె గల్లంతు కాగా, కుమార్తె మృతదేహం లభ్యమైంది. తన కూతురి శవపేటికపై పడి.. ‘అమ్మ లేకుండానే నిద్రపోయావా నా బంగారు తల్లి. భయం వేయడం లేదామ్మా’ అని ఆ తల్లి విలపిస్తున్న దృశ్యాలు మనసును ద్రవింపజేస్తున్నాయి. పాపికొండల విహారానికి బయల్దేరిన ఎన్నో కుటుంబాలకు పడవ ప్రమాదం విషాదం మిగిల్చిన విషయం విదితమే. వీరిలో తిరుపతికి చెందిన మధులత కుటుంబం కూడా ఒకటి. తండ్రి అస్థికలు గోదావరిలో కలిపేందుకు భర్త సుబ్రహ్మణ్యం, భార్య మధులత, కుమార్తె హాసిని లు బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో సుబ్రహ్మణ్యం, హాసిని గల్లంతుకాగా... మధులత ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా హాసిని(12) మృతదేహాన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి. సుబ్రహ్మణ్యం జాడ ఇంతవరకు తెలియరాలేదు.

 

ఇక గోదావరి పడవ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. పట్టిసీమలో ఒకటి, ధవళేశ్వరం వద్ద రెండు, అనుగులూరు కాఫర్‌ డ్యాం వద్ద రెండు, పోలవరం వద్ద ఒకటి, ఆత్రేయపురం దిగువ ప్రాంతంలో రెండు, తాళ్లపూడి వద్ద ఒక మృతదేహాన్ని మంగళవారం రక్షణా బృందాలు వెలికితీశాయి. కాగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక పడవ ప్రమాద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: