వైఎస్ జగన్ మంత్రివర్గంలో దూకుడు కనబరిచే మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ కుమార్ యాదవ్ అనే చెప్పాలి. మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా సత్తా చాటుతున్న అనిల్....ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2014లో వైసీపీ తరుపున నెల్లూరు సిటీ నుంచి తొలిసారి గెలిచి ఎమ్మెల్యే అయిన అనిల్...మొన్న ఎన్నికల్లో అనిల్ అదే స్థానం నుంచి స్వల్ప మెజారిటీతో మాజీ మంత్రి నారాయణపై విజయం సాధించారు. ఇక యువకుడు, ఉత్సాహవంతుడైన అనిల్ కు జగన్ తన కేబినెట్ లో చోటు ఇచ్చేశారు.


అది కూడా భారీ నీటి పారుదల శాఖ బాధ్యతలు అప్పగించారు. అయితే తొలిసారి మంత్రిగా ఆరంగ్రేటం చేసిన అనిల్ వందరోజుల పాలన పరంగా పని తీరుని ఒక్కసారి పరిశీలిస్తే...అనిల్ మొదట్లో శాఖపై పట్టు సాధించేందుకు కొంచెం ఇబ్బందులు పడ్డారని చెప్పొచ్చు. కానీ నిదానంగా శాఖపై సమీక్షలు చేయడం..జగన్ సూచనలు ఆధారంగా నడవడంతో శాఖపై పట్టు తెచ్చుకున్నారు.


పైగా గత టీడీపీ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల్లో భారీగా అవినీతికి పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో....వాటిని వెలికితీసే పనిలో అనిల్ గట్టిగానే పని చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ జీవనాడి అయిన పోలవరం విషయంలో జగన్ పర్యవేక్షణలో రివర్స్ టెండరింగ్ కి వెళ్ళి సంచలనం సృష్టించారు. అలాగే ఇటీవల గోదావరి, కృష్ణా నదులకు వరదలు వచ్చిన సందర్భంలో సమర్ధవంతంగా పని చేశారు.


అలాగే అనిల్ ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలకు వెంటనే కౌంటర్లు ఇస్తూ...ఆ పార్టీకి చుక్కలు చూపించారు. వరదల విషయంలో గానీ, పోలవరం రివర్స్ టెండరింగ్ లు విషయంలో గానీ టీడీపీ ఆరోపణలని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. అసెంబ్లీలో కూడా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. అయితే ఇంత దూకుడుగా ఉండే అనిల్ త్వరగా నోరు పారేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన మాట్లాడే లాంగ్వేజ్ పై ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.


ఇక మంత్రిగా ఉంటూనే సొంత నియోజకవర్గంలో సమస్యలపై కూడా అనిల్ త్వరగా స్పందిస్తూ...వాటిని వెంటనే పరిష్కరించి ఎమ్మెల్యేగా కూడా సక్సెస్ అయ్యారు. మొత్తం మీద మంత్రిగా అనిల్ ఆరంగ్రేటం బాగున్నా...మాటతీరు పరంగా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: