ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీలో చాలామంది నేతలు అడ్రెస్ లేకుండా పోయిన విషయం తెలిసిందే. చాలామంది నేతలు తమ దారి తాము చూసుకుంటూ పార్టీలు మారిపోతుంటే...మరికొందరు పార్టీ గురించి మనకెందుకులే అనే విధానంలో ఉన్నారు. పార్టీలో ఉన్న కొందరు నేతలు అధినేత పిలుపు మేరకు అధికార వైసీపీపై పోరాటం చేస్తున్న...ఆ నేతలు మాత్రం పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ముఖ్యంగా టీడీపీలో ఉన్న ముగ్గురు రాజులు పార్టీ ఆఫీసు దరిదాపుల్లోకి రావడంలేదు.


అందులో మొదటిగా ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం రాజు అశోక్ గజపతి రాజు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మొన్న ఎన్నికల్లో ఈయన విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే, ఈయన కుమార్తె అతిథి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసీ ఓడిపోయింది. పైగా జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ ఓటమి తర్వాత రాజు గారు అడ్రెస్ లేరు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల మూసివేతకు, ఇసుక విధానానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన అశోక్ బయటకురాలేదు. ఆఖరికి టీడీపీ కార్యకర్తల మీద దాడికి నిరసనగా ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన కదల్లేదు.


అటు 2014లో వైసీపీ తరుపున బొబ్బిలి నుంచి గెలుపొందిన సుజయకృష్ణ రంగారావు...ఆ తర్వాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక మొన్న ఎన్నికల్లో కూడా ఆయన బొబ్బిలి నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన ఘోరంగా ఓడిపోయారు. ఈయన కూడా ఓటమి తర్వాత పెద్దగా కనిపించలేదు. ఎప్పుడన్నా ఒకసారి మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన అవి పెద్ద లెక్కలోకి రాలేదు. ప్రస్తుతానికైతే ఈ బొబ్బిలి రాజు మన పని మనం చేసుకోవడం బెటర్ అనే విధంగా నడుచుకున్నట్లు తెలుస్తోంది.


ఇక ఇదే జిల్లాకు చెందిన కురుపాం రాజవంశీయుడు కేంద్ర మాజీ మంత్రి వైరిచ‌ర్ల కిషోర్ చంద్రదేవ్‌ అయితే ఎన్నికల ఫలితాల రోజు నుండే కనపడటం లేదు. ఈయన ఎక్కడ ఉన్నారో అనుచరులు కూడా తెలియదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఈ రాజు గారు అరకు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


మొత్తం మీద విజయనగరపు రాజులు, బొబ్బిలి రాజులు, కురుపాం రాజులు పార్టీతో పాటు...రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కనపడుతుంది. ఒకే పార్టీ లో ఒకే జిల్లాలో ఉన్న ఈ రాజులు పార్టీని గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. మరి అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాపై ఎలాంటి ఫోకస్ పెడతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: