ఆ ఎన్నిక‌ల పేరెత్తితేనే వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ టెన్ష‌న్ ప‌డుతున్నారా..?  అమ్మో.. ఇప్పుడా..! అంటూ వైసీపీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నాయా..? అంటే తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. ఇంత‌కీ ఏమిటా ఎన్నిక‌లు అని ఆలోచిస్తున్నారా.?  అవే గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు. ఈ ఎన్నిక‌ల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. ఇప్పుడు నిర్వ‌హించాలా వ‌ద్దా..? ఆని తెగ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదేమిటీ.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 151 సీట్ల‌తో  తిరుగులేని విజ‌యం సాధించిన వైసీపీ.. ఈ ఎన్నిక‌లు అనేవ‌ర‌కు ఎందుకు టెన్ష‌న్ ప‌డుతుంద‌న్న‌దానిపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తోంది.


నిజానికి..ఈ సెప్టెంబ‌ర్‌లోనే జీవీఎంసీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని హైకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఒక‌వేళ నిర్వ‌హించ‌క‌పోతే.. హైకోర్టుకు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఇక విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ తిరుగులేని విజ‌యాన్ని అందుకుంది. ఏకంగా 151 అసంబ్లీ స్థానాల్లో విజ‌యం సాధించి చ‌రిత్ర సృష్టించింది. అయితే.. ఇదే స‌మ‌యంలో గ్రేట‌ర్ విశాఖ‌లో మాత్రం ఆ పార్టీ స‌త్తాచాట‌లేక‌పోయింది. రాష్ట్ర‌మంత‌టా టీడీపీ బొక్క‌బోర్లాప‌డినా.. విశాఖ న‌గ‌రంలో మాత్రం నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించింది.


దీంతో ఇక్క‌డ వైసీపీ పెద్ద‌గా ప‌ట్టుసాధించ‌లేక‌పోయింది. ఇక మ‌రొక కార‌ణం కూడా ఉంది. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టి సుమారు వంద‌రోజులు దాటింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల్లో కొంత నిరుత్సాహ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఇదే స‌మ‌యంలో రాజ‌ధానిని త‌ర‌లింపుపై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లు కూడా ప్ర‌జ‌ల‌ను తీవ్ర గంద‌ర‌గోళానికి గురిచేశాయి.ఈ ప్ర‌తికూల పరిస్థితుల్లో గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. ఏమాత్రం తేడా వ‌చ్చినా అది పార్టీకి, ప్ర‌భుత్వానికి పెద్ద న‌ష్టం జ‌రుగుతుంద‌ని, ఇక టీడీపీకి బూస్టింగ్ ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.


విశాఖ మేయ‌ర్ ప‌ద‌విని క‌నుక టీడీపీకి అప్ప‌గిస్తే.. వైసీపీ ప‌రువుపోతుంద‌న్న ఆందోళ‌న‌లో పార్టీ శ్రేణులు ఉన్నాయి. అందుకే జీవీఎంసీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. దీనికితోడు అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరుతో కూడా న‌గ‌రాల్లో కాస్త వ్య‌తిరేక‌త ఉంది. అక్రమ కట్టడాలంటూ నగరంలో పలుచోట్ల భవనాలు, సెల్లార్లు కూల్చివేయడం కూడా.. వైసీపీ నేతల్లో జీవీఎంసీ ఎన్నికలపై భయం కలగడానికి కారణమ‌ని తెలుస్తోంది. కాగా, 2012లో జ‌రిగిన జీవీఎంసీ ఎన్నిక‌లను మ‌ళ్లీ ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించ‌లేదు. మ‌రి వైసీపీ ప్ర‌భుత్వం ఏం చేస్తుందో ? చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: