ప్రత్యేక  రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ ) అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే  కాకుండా,  రెండుసార్లు ప్రజల ఆశీస్సులతో అధికారం పీఠాన్ని  చేజిక్కించుకుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప  ప్రాంతీయ పార్టీగా ఏర్పాటైన టిఆర్ఎస్, ఇప్పుడు  మరో అరుదైన ఘనత సొంతం చేసుకోబోతుంది . ప్రాంతీయ పార్టీలు అనేవి పొరుగు రాష్ట్రాలకు  విస్తరించడం సహజమే కానీ ఉప ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీఆరెస్... ఇప్పుడు మరో రాష్ట్రానికి  విస్తరించనుంది.  మహారాష్ట్రలో  త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో,  అక్కడ టిఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.


తెలంగాణలోని  ఆదిలాబాద్ పొరుగునే ఉండే  నాందేడ్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు అనుమతించాలని కొంతమంది ఆసక్తి కలిగిన అభ్యర్థులు  టీఆరెస్ అధినేత  కేసీఆర్ ను కలిసి కోరినట్లు సమాచారం. దానికి ఆయన కూడా  సానుకూలంగా స్పందించడంతో ఇక మహారాష్ట్రలోని టిఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని ఆ  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతం లో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోను పోటీ చేయాలనుకున్న  ఔత్సాహికులు  కేసీఆర్ ను కలిసి తాము టీఆరెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తామని అనుమతించాలని కోరగా , ఆయన దానికి నిరాకరించినట్లు తెలుస్తోంది .


కేసీఆర్ అభిమానులు  పలు సందర్భాల్లో ఆంధ్ర ప్రదేశ్ లో టీఆరెస్ కార్యకలాపాలు ప్రారంభించాలని కోరినప్పటికీ , ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు . అయితే మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా నుంచి టీఆరెస్ తరుపున ఔత్సాహికులు టీఆరెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తామంటే అంగీకరించడం వెనుక, కేసీఆర్ మదిలో ఏదో పెద్ద వ్యూహమే ఉండి ఉంటుందని సొంత పార్టీ నేతలు , రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు .  అయితే ఇప్పటివరకు మహారాష్ట్రలో పోటీ చేసే విషయమై టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: