అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఉసురు తగులుతుందంటూ టిడిపి శాపనార్ధాలు మొదలయ్యాయి.  కోడెలపైనే కాకుండా ఆయన కుటుంబంపైన కూడా వైసిపి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధించినట్లు టిడిపి నేతలు మండిపోయారు. 

 

మానసిక క్షోభకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేట్లు చేసిన కోడెల ఉసురు జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా తగులుతుందంటూ టిడిపి ఎంఎల్సీ రాజేంద్ర ప్రసాద్ శాపనార్ధాలు పెట్టటం ఆశ్చర్యంగా ఉంది.   పరిటాల రవీంద్ర హత్య జరిగిన తర్వాత పరిటాల ఉసురు దివంగత వైఎస్సార్ కు తగిలినట్లే కోడెల ఉసురు కూడా జగన్ కు తగలటం ఖాయమని రాజేంద్రప్రసాద్ చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

అప్పటికేదో పరిటాల రవీంద్ర మహాత్మా గాంధి అనుచరుడో లేకపోతే స్వామి వివేకానంద శిష్యుడో అయినట్లుంది ఎంఎల్సీ చెప్పింది. పరిటాల రవి చేతిలో ఎంతమంది ప్రత్యర్ధులు హత్యకు గురయ్యారో అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నేతలను అడిగితే చెబుతారు. అలాగే కోడెల కుటుంబం చేసిన అరాచకాలకు ఎంతమంది బలైపోయారో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో జనాలను, టిడిపి నేతలను అడిగితే చెబుతారు.

 

టిడిపి నేతలు చెప్పినట్లు  ఉసురు తగలటమే నిజమైతే ఐదేళ్ళ కోడెల కుటుంబం బాధితుల ఉసురు తగిలిందనే అనుకోవాల్సుంటుంది. బాధితుల ఉసురు తగలటం వల్లే కోడెల బలవన్మరణం పాలయ్యారని అనుకోవాలేమో ? కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి సాగించిన అరాచకాల గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. టిడిపి నేత చెప్పినట్లు వాళ్ళ ఉసురే తగిలిందేమో ?

 

మొత్తానికి రాజేంద్రప్రసాద్ శాపనార్ధాలు ఎలాగున్నాయంటే పిల్లి శాపానికి ఉట్టి పగులుతుందా అన్న సామెత గుర్తుకొస్తోంది. కోడెల మానసిక క్షోభకు గురైంది మీవల్లే అంటే కాదు మీవల్లే అంటూ వైసిపి-టిడిపి నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం అందరూ చూస్తున్నదే.  కాబట్టి ఎంఎల్సీ శాపనార్ధాలు పెట్టినట్లు కోడెలను మానసిక క్షోభకు గురిచేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా ? లేకపోతే చంద్రబాబునాయుడా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: