ఆర్టికల్‌ 370 రద్దు, అనంతరం జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న ప‌రిస్థితుల గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అంత‌ర్జాతీయంగా అంద‌రి దృష్టి క‌శ్మీర్‌పైనే ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) రంజన్‌ గొగోయ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని జస్టిస్‌లు ఏఎస్‌ బోబ్డే, ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ధర్మాసనం ఆర్టికల్‌ 370 రద్దు, అనంతరం జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదన‌లు విన్నారు. బాలల హక్కుల కార్యకర్తలు ఎనాక్షి గంగూలీ, ప్రొఫెసర్‌ శాంతా సిన్హా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా గొగోయ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో న్యాయ సంబంధ పరిస్థితులను తెలుసుకునేందుకు అవసరమైతే తానే స్వయంగా శ్రీనగర్‌కు వెళ్తానని ప్ర‌క‌టించారు. 


ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం రాష్ట్రంలో పలువురు బాలలను అక్రమంగా నిర్బంధించారని, జనాభా లెక్కల ప్రకారం 18 ఏండ్లలోపు వయసున్నవారిని వెంటనే జువెనల్‌ జస్టిస్‌ కమిటీ ముందు హాజరుపరిచేలా ఆదేశాలు జారీచేయాలని పిటిషనర్లు విన్నవించారు.  దీనికి గొగోయ్‌ స్పందిస్తూ బాధితులు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించేందుకు ఇబ్బందిపడటం చాలా తీవ్రమైన అంశమని అన్నారు. ‘ఒకవేళ మీరు చెప్పినట్టే ప్రజలు హైకోర్టును ఆశ్రయించడం కష్టంగా ఉంటే.. అది చాలా తీవ్రమైన అంశం. కోర్టుకు వెళ్లకుండా మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటున్నారా? ఎందుకు? మాతో చెప్పండి’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆంక్షల కారణంగా వెళ్లలేకపోతున్నారని న్యాయవాది చెప్పగా.. ‘దీనిపై వెంటనే జమ్ముకశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద్వారా నివేదిక తెప్పించుకుంటాం. పరిస్థితిని బట్టి అవసరమైతే స్వయంగా నేనే శ్రీనగర్‌కు వెళ్తా’ అని సీజేఐ పేర్కొన్నారు. తాను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటానని, ఒకవేళ పిటిషనర్లు చేసిన వ్యాఖ్యలు తప్పని తేలితే దానికి అనుగుణంగా శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 


కాగా, కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్‌ పాలనాయంత్రాంగం కలిసి వీలైనంత తర్వగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టంచేసింది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించాలంటూ కశ్మీర్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అనురాధా భాసిన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్‌ తరఫున వృందా గ్రోవర్‌ వాదనలు వినిపించారు. జర్నలిస్టులపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, సెల్‌, ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఒకవేళ పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంటే వెంటనే హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో హైకోర్టు వద్ద సమాచారం ఉంటుందని పేర్కొన్నది. దీనిపై వృందా గ్రోవర్‌ స్పందిస్తూ సెల్‌, ఇంటర్నెట్‌ సేవలతోపాటు ప్రజారవాణాను నిలిపివేయడంతో ప్రజలు హైకోర్టుకు కూడా వెళ్లలేకపోతున్నారని చెప్పారు. కొన్నిచోట్ల ఔషధ దుకాణాలను కూడా మూసివేశారన్నారు. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ కశ్మీర్‌ కేంద్రంగా పనిచేసే అన్ని వార్తాపత్రికలు వెలువడుతున్నాయని, పిటిషనర్లు చెప్పేదాంట్లో వాస్తవం లేదన్నారు. 
జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ ఆగస్ట్‌ 5వ తేదీ నుంచి ఇప్పటివరకు ఒక్క బుల్లెట్‌ కూడా పేల్చలేదన్నారు. రాష్ట్రంలో 105 పోలీస్‌ స్టేషన్లు ఉండగా, 93 పీఎస్‌ల పరిధిలో (88శాతం) ఆంక్షలు ఎత్తివేశామన్నారు. జమ్ము, లడఖ్‌ డివిజన్లలో పూర్తిగా ఎత్తివేసినట్టు తెలిపారు. మందుల కొరత లేదని, మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. కేకే వేణుగోపాల్‌ వాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతున్నదని చెప్పారు. ఒకవైపు వేర్పాటువాదులు, రెండోవైపు సరిహద్దు అవతలి నుంచి వచ్చిన ఉగ్రవాదులు, మూడోవైపు విదేశీ నిధుల సాయం పొందుతున్న స్థానిక ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని అన్నారు. ఆగస్ట్‌ 5 నుంచి ఈ నెల 15 వరకు లోయలోని దవాఖానల్లో 10.52 లక్షల మంది వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు వెల్లడించారు. వాదనలు విన్న అనంతరం రాష్ట్రంలో ఆంక్షల ఎత్తివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన, ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: